విద్యార్థులకు ఐఎస్‌బీ స్కిల్లింగ్ కోర్సుల్లో శిక్షణ

ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉపాధి మార్గాలు మెరుగుపడేలా విస్తృత ఉపాధి నైపుణ్యాలు అందజేసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలు, ఫార్మసీ కాలేజీలతోపాటు పలు అటానమస్ కాలేజీల్లో చదువుకుంటున్న, పూర్వ విద్యార్థుల్లో ఆసక్తి గలవారు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వ్యాపార అక్షరాస్యత నైపుణ్యాలు (బిజినెస్ లిటరసీ స్కిల్స్), ప్రవర్తనా నైపుణ్యాలు (బిహేవియరల్ స్కిల్స్), డిజిటల్ అక్షరాస్యత నైపుణ్యాలు (డిజిటల్ లిటరసీ స్కిల్స్), వ్యవస్థాపక అక్షరాస్యత నైపుణ్యాలు (ఎంట్రప్రెన్యూరల్ లిటరసీ స్కిల్స్) కోర్సుల్లో ఒక్కొక్క కోర్సుకు 40 గంటలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ కోర్సులను ఐఎస్‌బీ, దాని అనుబంధ అధ్యాపకులు ఆన్‌లైన్‌లో బోధిస్తారు.
విద్యార్థులకు తక్కువ ధరలో నాణ్యమైన శిక్షణ అందించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఐఎస్‌బీ కలిసి పనిచేస్తున్నాయని తెలిపింది. ఆయా కోర్సులకు సంబంధించిన ఫీజు, ఇతర వివరాల కోసం https://skillshub.isb.edu/apssdc/ ద్వారా తెలుసుకోవచ్చని స్కిల్ డెవలప్‌మెంట్–ట్రైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సారభ్ గౌర్ తెలిపారు. నిపుణుల సహకారంతో కార్పొరేషన్ రూపొందించిన స్కిల్ ట్రైనింగ్ ప్లాట్ ఫామ్స్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ కోరారు.
సంబంధిత వార్తలు