ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Srivari free darshan tokens from 29th August - Sakshi

శనివారం నుంచి శ్రీవారి ఉచిత దర్శన టోకెన్లు  

టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు  

మీడియాకు వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: సెప్టెంబర్‌ 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అక్టోబర్‌లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, మేడా మల్లికార్జునరెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, గోవిందహరి, దామోదర్‌రావు, వెంకటప్రసాద్‌కుమార్, డీపీ అనంత, కృష్ణమూర్తి వైద్యనాథన్, పార్థసారథి, మురళీకృష్ణ, రమణమూర్తి రాజు, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు పి.బసంత్‌కుమార్, సదా భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

► శనివారం నుంచి తిరుపతిలో 3 వేల ఉచిత శ్రీవారి దర్శన టోకెన్లు  
► శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మించాలని, స్థానిక భక్తులను భాగస్వామ్యం చేస్తూ దాతల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించాం.  
► టీటీడీ ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకపై నగదు, బంగారం డిపాజిట్లలోంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేలా నిర్ణయం.  
► బర్డ్‌ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న వారి కోసం రూ.5.4 కోట్లతో బర్డ్‌ పరిపాలన భవనం మూడో అంతస్తులో 50 ప్రత్యేక గదుల నిర్మాణానికి ఆమోదం.  
►  విశాఖ దివ్య క్షేత్రం ఘాట్‌ రహదారి వాలు గోడల నిర్మాణానికి రూ.4.95 కోట్లతో ఆమోదం. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సీఎం చేతుల మీదుగా ఈ ఆలయానికి 
మహా కుంభాభిషేకం.  
► కరోనా కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాలని నిర్ణయం.   
► తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇందుకోసం టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి రూ.కోటి విరాళం ప్రకటించారు.  
► ఇదిలా ఉండగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చరిత్రలో తొలిసారి పాలకమండలి సమావేశాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top