
తెరుచుకోని గుజ్జు పరిశ్రమలు
సిండికేట్‌గా మారిన వ్యాపారులు
టేబుల్ రకం కాయలు టన్ను రూ.12 వేలకు పరిమితం
సాధారణ కాయలకు రూ. 5 వేలు దాటని పరిస్థితి
ఆందోళన బాటలో మామిడి రైతులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఏడాది మామిడి రైతుల పాలిట శాపంగా మారింది. ప్రత్యేకించి తోతాపురికి మార్కెట్‌లో ధర లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మామిడి 9.97 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది 45 లక్షల టన్నుల దిగుబడులొస్తాయన్నది తొలి అంచనా. అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో కనీసం 30 లక్షల టన్నుల దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తోతాపురి 1.60 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, ఈ ఏడాది 4 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయన్నది అంచనా. ఇందులో చిత్తూరు, తిరుపతి జిల్లా వాటానే దాదాపు 90 శాతం.
ఈ జిల్లాల్లో ఈ రకం దిగుబడులు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, కొనుగోళ్లే దారుణంగా ఉన్నాయి. జూన్ ప్రారంభమైనా, ఈ రెండు జిల్లాల్లో గుజ్జు పరిశ్రమలు తోతాపురి కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే గతేడాది గుజ్జు నేటికీ అమ్ముడుపోలేదంటున్నారు. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో దాదాపు 2.74 లక్షల టన్నుల గుజ్జు నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి.
అయితే ఇందులో కొంతభాగం వివిధ రూపాల్లో నష్టాలకు పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ గుజ్జు నిల్వలు 1.50 లక్షల టన్నులకు చేరాయి. ఈ నిల్వలు పూర్తిగా ఎగుమతి అయితే తప్ప కొత్తగా కొనుగోలు చేయడం, గుజ్జు రూపంలో మార్చడం చేయలేమని కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీనికితోడు గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేశారు.
భవిష్యత్తుపై భయం..
2023–24 సీజన్‌లో టన్ను రూ.25–30 వేల మధ్య పలికిన టేబుల్ (నాణ్యత) రకం తోతాపురికి గతేడాది రూ.20 వేలు పలుకగా, ఈసారి రూ.12 వేలకు మించి చెల్లించడం లేదు. కాయల సైజు, నాణ్యతను బట్టి సాధారణ కాయల ధర రూ.5 వేలకు సైతం పడిపోతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎగుమతి రకాలకూ దిక్కులేదు..
ఎగుమతి రకాలకు సైతం ఈసారి ధర లేని పరిస్థితి నెలకొంది. రాయలసీమ జిల్లాల్లో తోతాపురి తర్వాత ఎక్కువగా సాగయ్యే బేనిషా రకానికి నాణ్యత ప్రాతిపదికన రూ.7 నుంచి రూ.20 వేలు, అల్ఫోన్సో, కాలేపాడు మల్లిక రకాలకు టన్నుకు రూ.20 నుంచి రూ. 30 వేల ధర పలుకుతోంది. గతంలో టన్ను రూ.లక్షకుపైగా పలికిన ఇమామ్ పసంద్‌కు సైతం ఈసారి రూ.40 వేలకు మించి ధరలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సాగులో ఉన్న బంగినపల్లి రకాల విషయంలో 2023–24లో టన్ను గరిష్టంగా రూ.50–60 వేల ధర పలికింది. గతేడాది రూ.30–35 వేలు పలుకగా, ఈసారి కేవలం రూ.15–20 వేలకు మించి పలకడం లేదు.
అడిగే వారు లేరు..కొనేవారు లేరు..
మాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. పులేరా (చందూర) టన్నుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు రేటు ఉంది. ఇలా ఉంటే రైతు లకు గిట్టుబాటు కాదు. తోతాపురి అడిగే వారు లేరు. చెట్లల్లో కాయలు రాలిపోయే పరిస్థితి. – కరుణాకర్ రెడ్డి, మామిడి రైతు, చిత్తూరు జిల్లా
గిట్టుబాటు ధర కల్పించాలి..
జిల్లా ప్రస్తుతం మామిడిపైనే ఆధారపడి ఉంది. తోతాపురికి కనీస ధర టన్నుకు రూ.15 వేలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోతే... మాకు ఆందోళన బాట తప్పదు. – హరిబాబు చౌదరి, రైతు నాయకుడు, చిత్తూరు జిల్లా