
అన్నమయ్య: తల్లికి వందనం నగదు కోసం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భర్త తాగే మద్యంలో భార్య విషం కలిపి చంపేసిన ఘటన అన్నమయ్య జిల్లా కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డిగానిపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వంకొల్ల చంద్రశేఖర్(46), రమాదేవి దంపతులు. ఇటీవల తల్లికి వందనం నగదు రమాదేవి ఖాతాలో జమయింది. ఈ నగదును చంద్రశేఖర్ తీసుకోవడంతో ఇద్దరూ గొడవ పడ్డారు.
ఈ నెల 2న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్, భార్యను తాను తెచ్చుకున్న మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమాదేవి, మద్యం గ్లాసులో విషం కలిపి ఇచ్చింది. అనంతరం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన రమాదేవి భర్త గొంతుపట్టుకుని నొక్కడంతో ఆమె చేతిగోళ్లు గుచ్చుకుని, చంద్రశేఖర్ గొంతుకు గాయమైంది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తమ్ముడు మహేష్.. వదినపై అనుమానంతో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రమాదేవి తన భర్తను హత్య చేసినట్లు తేలింది.