సెల్‌ రోగం..అధికమవుతున్న టెక్స్ట్‌ నెక్‌ సిండ్రోమ్‌

Text Neck Syndrome Problems Increasing Due To Mobile Phones - Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ లేకపోతే ఏ ఒక్క పని జరగని పరిస్థితి. సెల్‌ఫోన్‌ వల్ల జరిగే మంచిని అటుంచితే... ఇప్పటికే చాలామంది ఎక్కువగా  మొబైల్‌ఫోన్లు వినియోగిస్తూ రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. కంటి సమస్యలతో కొందరు, గేమింగ్‌కు బానిసలై మరికొందరు, మానసిక సమస్యలతో కూడా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా ‘టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌’ (మెడకు సంబంధించిన నొప్పి) పట్టిపీడిస్తోంది.  

  • ఉరవకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. తల ఓవైపునకు వంచినట్టు ఉందని బాధపడుతుంటే తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించారు. ఈమె ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటం వల్ల ఇలా జరిగిందని న్యూరో వైద్యులు చెప్పారు. ఇప్పుడామె నొప్పి భరించలేక ఆక్యుపేషనల్‌ థెరఫీ చేయిస్తోంది. 
  • అనంతపురానికి చెందిన అనీల్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమెరికాలో కూడా పదేళ్లు పనిచేసి వచ్చారు. మొబైల్‌ ఫోన్‌ వాడకం పెరిగి ఆయనకు మెడనొప్పితో పాటు నడుమునొప్పి వచ్చింది. నగరంలోనే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న వారిలో ఎక్కువ మంది ‘టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ ’కు గురవుతున్నట్లు తేలింది. దీనివల్ల మెడ వంకర్లు పోవడం, మెడనొప్పి రావడం, తలెత్తుకు తిరగలేకపోవడం జరుగుతోంది. ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ ఎర్గొనోమిక్స్‌ అనే జర్నల్‌  టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది.  ఈ సిండ్రోమ్‌ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు.  

ఏమిటీ టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌? 
టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ అనేది  వైరసో, బాక్టీరియానో కాదు. తదేకంగా సెల్‌ఫోన్‌ను వాడుతున్న వారికి వచ్చే ప్రత్యేక జబ్బు. స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారిలో ఈ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా టెక్ట్స్‌ మెసేజ్‌లు ఎక్కువ సేపు చూస్తూండటం వల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి రావడం, ఇది ఇలాగే కొనసాగి, తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పిరావడం వంటివి జరుగుతున్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు.  

టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ నుంచి బయట పడండిలా... 

  • రెండు, మూడు నిముషాలకు కంటే     ఎక్కువగా మెడలు వంచి సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు చూడకూడదు. 
  • స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారు పదే         పదే మెడను రొటేట్‌ అంటే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. 
  • ప్రతి గంటకోసారి రెండు మూడు సార్లు తలను పైకెత్తి మళ్లీ కిందికి బలవంతంగా వంచాలి. 
  • మెసేజ్‌ను చదవాలనుకున్నప్పుడు కుర్చీలో వెనక్కు వాలి ఫోన్‌ను ముఖంపైకి తెచ్చుకుని చదువుకోవాలి. 
  • పెద్ద పెద్ద మెసేజ్‌లు ఉన్నప్పుడు అంతా ఒకేసారి చదవకుండా మధ్యలో విరామం తీసుకుని మెడ వ్యాయామం చేయాలి. 
  • రోజూ యోగాసనాలు చేస్తే కండరాలు, నరాల వ్యవస్థ సానుకూలంగా మారి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. 

వ్యాయామమే పరిష్కారం 
చాలామంది టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ గురై మెడనొప్పి తట్టుకోలేక పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారు. ఇది కరెక్టు కాదు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గచ్చుగానీ, భవిష్యత్‌లో ప్రమాదం ఎక్కువ. తలకు, మెడకు సంబంధించి వ్యాయామం మంచిది. యోగా వల్ల చాలా వరకు నొప్పిని నియంత్రించుకోవచ్చు. 
– జె.నరేష్‌బాబు, మెడ, వెన్నుపూస వైద్య నిపుణులు 

తక్కువ సేపు వాడాలి 
మొబైల్‌ ఫ్లోన్లు చిన్నతనం నుంచే అలవాటు పడిన చాలామంది పిల్లలు ఇప్పటికే దృష్టిలోపంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఫోన్‌ చూడటం వల్ల సున్నితమైన కంటికి సంబంధించి అవయవాలు దెబ్బతింటున్నాయి. వీలైనంత తక్కువ సేపు వాడటం మంచిది. 
– పల్లంరెడ్డి నివేదిత, కంటివైద్య నిపుణురాలు 

ఉచ్చులో ఇరుక్కుపోయారు 
ఓ వైపు మెడనొప్పి, నడుమునొప్పులే కాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మొబైల్‌ వాడి గేమింగ్, బెట్టింగ్‌ల కారణంగా వ్యసనాలకు లోనయ్యారు. నిద్రలేమి కారణంగా మెంటల్‌ కండీషన్‌ ఇన్‌బ్యాలెన్స్‌ అవుతోంది. చాలా మందికి చదువుమీద దృష్టి పోతోంది. మానసిక బలహీనతల వల్ల డ్రగ్స్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. 
– డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top