Ravi Telugu Traveller: 186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్‌

Telugu Traveler Ravi Prabhu Who Traveled Around The World - Sakshi

విజయనగరం: విశాఖపట్టణానికి చెందిన రవి ప్రభు అరుదైన ఘనత సాధించారు. ఒక వైపు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తూనే వీలున్నప్పుడల్లా విదేశీ పర్యటనలు చేశారు. చిన్నప్పటి కోరికను సాధించుకోవడానికి తగిన ప్రణాళికలు రచించుకున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశారు. అమెరికాలోని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్‌ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా పని చేస్తూనే.. తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను చుట్టేశారు.

అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ భారతీయ యువతకు.. అక్కడ దేశాల యువతకు తారతమ్యం ఏమిటో తెలుసుకుని విశదీకరిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరం వచ్చిన ఆయనకు జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య స్వాగతం పలికారు. స్థానిక నెహ్రూ యువకేంద్రంలో డ్వామా ఏపీడీ లక్ష్మణరావుతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా రవిప్రభు వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటాల్లోనే... 

వారి ఐడియాలజీ.. మన యువతకు.. 
ఎప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే.. అసలు మీరెందుకు ఇన్ని దేశాలు తిరిగారని. దీనికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. యువత ఎన్నో అనుకుంటారు. ఏవేవో కలలు కంటారు. కానీ వాటిని సొంతం చేసుకోవడంలో మాత్రం తడబడతారు. కొంతమంది అనుకున్నది సాధిస్తారు. మరికొందరు విఫలమవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి, ఆశ ఉంటాయి. నాక్కూడా చిన్నప్పటి నుంచి ఒక్కటే ఆశ ఉండేది.

ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగాలి. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అక్కడి ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా అమెరికా వెళ్లి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరా. నా సొంత డబ్బులతోనే ఇంతవరకు 186 దేశాలు తిరిగాను. విదేశాల్లో పర్యటించినప్పుడు చాలా కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్నాను. అక్కడ విద్యాభ్యాసం తీరు.. నేర్చుకునే విధానాలు వేరు. కొన్ని దేశాల్లోని విద్యార్థుల ఐడియాలజీ బాగుంటుంది. అలాంటి అంశాలను తెలుసుకొని భారతీయ యువతకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతోనే నేను ఈ దేశాలన్నీ తిరిగాను. నేను వెళ్లాల్సినవి ఇంకా 9 దేశాలు ఉన్నాయి. త్వరలోనే ఆ దేశాల్లో కూడా పర్యటిస్తాను.

(చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top