ఇదేం పొత్తు..? ఇవేం సీట్లు..? జనసైనికుల ఆగ్రహజ్వాల
40 శాతం వాటా అడిగితే అరకొర విదిలించిన చంద్రబాబు
మారు మాట్లాడకుండా తలొగ్గిన జనసేన నాయకత్వం
నాలుగు కార్పొరేషన్లు ఇచ్చినట్టు చూపినా.. రెండింటికి ఎన్నికలే లేవు
21 మున్సిపాలిటీల్లో రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెంకూ ఎన్నికలు లేవు
మచిలీపట్నం, ఒంగోలు, శ్రీకాళహస్తి.. సహా అడిగినవన్నీ టీడీపీకే
ఎన్నికలు జరగని పీఠాలను మిత్రులకు అంటగట్టిన చంద్రబాబు
పార్టీ బతకాలంటే స్థానిక ఎన్నికలే కీలకం.. కానీ దాసోహం అనేశాం
ఇక మన పార్టీ చాపచుట్టేసినట్టే కనిపిస్తోంది
ఇది జనం కోసం పుట్టిన పార్టీనా.? బాబు కోసం పుట్టిన పార్టీనా?
జనసైనికుల అంతర్మథనం... పార్టీలో అంతులేని నిర్వేదం
సాక్షి, అమరావతి: నలభై శాతం వాటా అన్నారు. ఆరు మేయర్ పీఠాలు ఇవ్వాల్సిందేనని చర్చల్లో పట్టుబట్టినట్టు హడావుడి చేశారు. చివరకు చంద్రబాబు ఏం ఇచ్చారో అదే తీసుకున్నారు. ‘‘ఇక మనం చాపచుట్టేసినట్టే కనిపిస్తోంది.. పార్టీ బతకాలి అంటే స్థానిక ఎన్నికలు కీలకం.. అలాంటి వాటిలో కూడా దాసోహం అన్నారు. ఇది చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ తప్ప జనం కోసం, మన కోసం పుట్టిన పార్టీ కాదు..’’ అని జనసైనికులు మండిపడుతున్నారు. అధినాయకత్వం తీరుపై జనసైనికుల ఆగ్రహజ్వాలలు మిన్నుముడుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో కూటమి తరఫున సీట్ల పంపకం జాబితాను టీడీపీ కార్యాలయం గురువారం విడుదల చేసింది.
జనసేనకు 4 కార్పొరేషన్లు ఇచ్చినట్టు చూపించినా, అందులో రెండింటికి ఇప్పట్లో ఎన్నికలే లేవు. ఈ నెల 28న ఎన్నికలు జరిగే 13 కార్పొరేషన్లలో జనసేనకు దక్కింది రెండే. అడిగినన్ని సీట్లు అలవోకగా సాధించేస్తాడనుకున్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ చర్చల వేళ ముఖం చాటేసి మౌనంగా హైదరాబాద్ వెళ్లిపోవడం, జాబితా వచ్చాకా నోరు మెదపకపోవడంతో జనసైనికులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదేం పొత్తు.. దీన్ని సర్దుబాటు అంటారా? లొంగుబాటు అంటారా? లేక మన దౌర్భాగ్యం అంటారా? అని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
40% అడిగితే.. అరకొర విదిలింపు
మంగళవారం జనసేన మంత్రి కందుల దుర్గేష్ పార్టీ లోగోతో ఎక్స్ లో పోస్టర్ విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవుల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులు కేటాయించాలని, 6 మేయర్లు, 38 మున్సిపల్ చైర్మన్లు, 1,937 వార్డులు సహా ప్రతి పదవిలో వాటా ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఆ డిమాండ్పై టీడీపీ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరుసటి రోజే సీఎంతో భేటీ తర్వాత ‘ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదు’ అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట మార్చారు. చివరికి చంద్రబాబు చెప్పినట్టు తల ఊపి ఆయన ఇచ్చిన అరకొర సీట్లను ఆనందంగా తీసుకుని తలాడించుకుంటూ బయటికి వచ్చారు.

సర్దుబాటు వివరాలివీ
17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు.. మొత్తం 123 పీఠాల్లో టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9 పంచుకున్నాయి. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు.. బీజేపీకి రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు కేటాయించారు. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, ఒంగోలు, మచిలీపట్నం, విజయనగరం, చిత్తూరు, మంగళగిరి–తాడేపల్లి.. 11 కార్పొరేషన్లను టీడీపీ తన వద్దే ఉంచుకుంది. చర్చలు కొలిక్కి రాకముందే టీడీపీ గెజిట్ పత్రికల్లో వచ్చిన లీకులే చివరకు అధికారిక జాబితాగా మారాయి. చంద్రబాబు ముందే గీసిన గీత దాటకుండా జనసేన తలొగ్గిందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇచ్చిన వాటిలోనూ ఉత్తుత్తి సీట్లు
పంచాయతీల విలీనం, డీలిమిటేషన్ వంటి కోర్టు కేసుల కారణంగా 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేనకు ఇచ్చిన కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లు ఈ ఎన్నికలు లేని జాబితాలోనే ఉన్నాయి. శ్రీకాకుళంలో అయితే 2005 తర్వాత ఎన్నికలే జరగలేదు. జనసేనకు మిగిలింది విజయవాడ, ఏలూరు మాత్రమే. టీడీపీ తీసుకున్న 11 కార్పొరేషన్లలో మాత్రం ఎన్నికలు లేనిది మంగళగిరి–తాడేపల్లి ఒక్కటే. మున్సిపాలిటీల్లోనూ అదే తంతు.
జనసేనకు ఇచ్చిన 21లో రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెంకు ఎన్నికలు లేవు. పశ్చిమ గోదావరిలోని రెండు కీలక పట్టణాలనూ కాగితాల్లోనే ఇచ్చారు. బీజేపీకి ఇచ్చిన రాజమహేంద్రవరం కార్పొరేషన్, బాపట్ల, కావలి మున్సిపాలిటీలకూ ఎన్నికలు లేవు. ఎన్నికలు జరిగే సీట్లు టీడీపీకి, ఎన్నికలు లేని సీట్లు మిత్రపక్షాలకు.. ఇదేనా పొత్తు ధర్మం అని జనసేన వర్గాలు నిలదీస్తున్నాయి. లెక్కలో ఎక్కువ చూపించి, ఎన్నికలు లేని సీట్లు అంటగట్టడం ద్వారా చంద్రబాబు మిత్రపక్షాలను అవమానించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అడిగినవన్నీ టీడీపీకే
జనసేన పట్టుబట్టిన సీట్లు ఒక్కొక్కటిగా చేజారాయి. మచిలీపట్నం జనసేనకు దాదాపు ఖరారు అని మొదట్లో ప్రచారం జరిగినా చివరకు టీడీపీకే వెళ్లింది. ఒంగోలు, శ్రీకాళహస్తి అడిగినా ఇవ్వలేదు. జనసేనకేనని ప్రచారం జరిగిన అనంతపురం కార్పొరేషన్ బీజేపీకి వెళ్లింది. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు రెండు దక్కితే, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి దక్కింది.
నాయకత్వం మౌనం.. జనసైనికుల ఆగ్రహం
కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని, కేడర్ సంతృప్తి చెందేలా పోటీ చేస్తామని జనసేన నేతలు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. జాబితా వచ్చాక ఒక్కరూ నోరు మెదపడం లేదు. 40 శాతం ఏమైంది, ఎన్నికలే లేని సీట్లు తీసుకుని ఏం చేయాలి, అడిగిన సీట్లన్నీ ఎందుకు వదులుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లే లేరు. ‘మనం 40 శాతం అడిగాం. వాళ్లు ఏం ఇవ్వాలనుకున్నారో అదే ఇచ్చారు. అందులోనూ రెండు కార్పొరేషన్లకు ఎన్నికలే లేవు. అయినా మన నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు?’ అని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఏం చెబితే అది చేయక తప్పని పరిస్థితిలో తమ నాయకత్వం ఉందని ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లతో సర్దుకున్నాం, స్థానిక ఎన్నికల్లోనూ అరకొర సీట్లతో సరిపెట్టుకోవాలా అని నిలదీస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోడ్డెక్కింది తామేనని, కూటమి కోసం ఎక్కువ త్యాగం చేసింది జనసేనేనని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని, ఆ త్యాగాలకు ఇదేనా ప్రతిఫలమని ప్రశ్నిస్తున్నారు.


