13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో నేటి నుంచే నామినేషన్లు
నేటి ఉదయం నోటిఫికేషన్ జారీ, 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
విజయనగరంలో 27న పైడితల్లమ్మ సిరిమానోత్సవం
దీంతో పోలింగ్‌ను రిజర్వు తేదీ 29కి మార్చాలంటూ ఎస్ఈసీకి జిల్లా కలెక్టర్‌కు లేఖ
సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. విజయనగరం సహా రాష్ట్రవ్యాప్తంగా 13 నగర కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు కలిపి మొత్తం 100చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ బుధవారమే షెడ్యూల్‌తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీచేసిన విషయం తెలిసిందే.
ఆ మేరకు 13 మేయర్ పదవులతో పాటు 922 కార్పొరేటర్ పదవులకు.. 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో మొత్తం 87 చైర్మన్ పదవులు, 3,020 వార్డు కౌన్సిలర్ పదవులకు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శుక్రవారం ఉదయం వేర్వేరుగా ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అనంతరం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 18వ తేదీ సా.3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.
విజయనగరం కార్పొరేషన్ పోలింగ్ తేదీ మార్పు?
ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవమైన పైడితల్లమ్మ సిరిమానోత్సవం ఈనెల 27న జరగనున్నందున విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ తేదీని ఈనెల 28 నుంచి 29కి మార్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఉత్సవం రోజున పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ఉత్సవ విధుల్లో ఉండడంవల్ల ఎన్నికల విధులపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకట్రెండు రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.


