మొక్కజొన్న మాటున భారీగా గంజాయి సాగు
ఇప్పటికే రెండుసార్లు కోత కోసినట్టు సమాచారం
రూ.2 కోట్ల విలువైన సరుకు విక్రయించినట్టు గుర్తింపు!
జిల్లా చరిత్రలో మొదటిసారిగా భారీ స్థాయిలో సాగు
పోలీసుల అదుపులో నిందితులు?
దుత్తలూరు (ఉదయగిరి): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న సాగు మాటున భారీ స్థాయిలో చేపట్టిన గంజాయి సాగు గుట్టు గురువారం రాత్రి రట్టయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. దుత్తలూరు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారి సమీపంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. సర్వే నంబరు 1582లో 9.50 ఎకరాల్లో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం రెవెన్యూ రికార్డుల ప్రకారం కాకర్ల వెంకటేశ్వరరెడ్డి పేరుతో ఉంది. ఈ భూమిని ఓ వ్యక్తి మొక్కజొన్న సాగుకంటూ కౌలుకు తీసుకొని చుట్టూ మొక్కజొన్న పంట.. మధ్యలో రెండు ఎకరాల్లో గంజాయి సాగు చేపట్టాడు.
గంజాయి పంటకు సమృద్ధిగా నీటిని అందించేందుకు డ్రిప్ కూడా అమర్చాడు. పంటకు రక్షణగా కొంత మంది వ్యక్తులనూ నియమించాడు. అయినా గంజాయి గుప్పు బయటకు పొక్కింది. ఎస్పీ అదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ నాగరాజు సమక్షంలో డీసీఆర్బీ సీఐ భక్తవత్సలరెడ్డి, ఏబీ సీఐ 2 కే వెంకట్రావు, ఎస్సై మహేంద్ర ఆధ్యర్యంలో గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గంజాయి సాగుదారుడు ఉప్పలపాటి వెంకటసుబ్బారెడ్డి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంకట సుబ్బారెడ్డిపై దుత్తలూరు పోలీసుస్టేషన్లో సస్పెక్ట్ షీట్తోపాటు పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో గంజాయి సాగు, రవాణాతోపాటు పలు ఇతర కేసులు, ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు సార్లు ఈ క్షేత్రంలో గంజాయి పంటను కోతకోసి దాదాపు రూ.2 కోట్లు వరకు సరకు అమ్మకాలు చేపట్టినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. దుత్తలూరు మండల కేంద్రానికి కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ స్థాయిలో గంజాయి సాగు చేపట్టడం అందరినీ విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారం స్థానిక పోలీసులతోపాటు ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. అధికారుల సహకారం లేకుండా ఈ స్థాయిలో సాగు జరిగే ఆస్కారం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తివివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది.


