మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు
బీసీ లెక్కలు లేకుండానే రిజర్వేషన్లు ఖరారు చేసింది
నోటిఫికేషన్ తర్వాతా ఎన్నికల ప్రక్రియను నిలువరించవచ్చు
సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది
హైకోర్టులో పిల్.. ముగిసిన వాదనలు
తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని, సహేతుక గణాంకాలను సేకరించకుండా రిజర్వేషన్లను ఖరారు చేశారని, ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వ చర్యల వల్ల బీసీలకు నష్టం కలుగుతోందంటూ గుంటూరు జిల్లా, చుండూరు మండలం ఆలపాడుకి చెందిన డాక్టర్ సీహెచ్ రవికుమార్ ఈ పిల్ దాఖలు చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా నిబంధనల ప్రకారం ప్రక్రియను నిలువరించవచ్చని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక వ్యాజ్యంలో తీర్పునిచ్చిందని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష చేసిన వాదనలు క్లుప్తంగా..
» ఏకీకృత కుటుంబ సర్వే డేటా ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఈ నివేదికను ఆమోదించినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. దీనిని ఎందుకు రహస్యంగా ఉంచుతుందో మాత్రం అర్థం కావడం లేదు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించకుండానే ప్రభుత్వం దానిని ఆమోదించడమూ సరికాదు. అలాంటి నివేదిక ఆధారంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడం తగదు.
» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన ట్రిపుల్ టెస్ట్ను చేపట్టకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసింది.
» రిజర్వేషన్ల కల్పనకు బీసీ జనగణన తప్పనిసరి. అయితే ప్రభుత్వం ఆ పని చేయకుండా ఏకపక్షంగా బీసీలకు అసంబద్ధంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది.
» సరైన డేటా సేకరించకుండా రిజర్వేషన్లు నిర్ణయించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోతున్నాయి.


