అప్పన్నా.. నీ కొండను నీవే కాపాడుకో | Construction of data centers on Simhachalam lands poses a major threat to the environment | Sakshi
Sakshi News home page

అప్పన్నా.. నీ కొండను నీవే కాపాడుకో

Oct 16 2026 4:45 AM | Updated on Oct 16 2026 4:45 AM

Construction of data centers on Simhachalam lands poses a major threat to the environment

సింహాచలం భూముల్లో డేటా సెంటర్‌ నిర్మాణాలతో పర్యావరణానికి పెనుముప్పు

కొండలు, అడవులు ధ్వంసమైతే నీటి కొరత, ఆకస్మిక వరదల ప్రమాదం 

వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ హెచ్చరిక    

సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం సమర్పణ

మహారాణిపేట/బీచ్‌రోడ్డు: ‘అప్పన్నా.. నీ కొండను నీవే కాపాడుకో..’ అంటూ వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, జల్‌ బిరాదరి వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ సింహాద్రి అప్పన్న స్వామికి వినతిపత్రం సమర్పించారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు పేరుతో సింహాచలం దేవస్థాన భూములు, కొండలు, అడవులు ధ్వంసమైతే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం, ఆయన నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన పాలకులు, అధికారులు పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఏపీ అంటూ చెప్పుకునే రాష్ట్ర పాలకులకు చురకలంటించారు.  

భూముల కేటాయింపుపై అభ్యంతరం.. 
సింహాచలం దేవస్థానానికి చెందిన ముడసర్లోవ ప్రాంతంలోని సుమారు 165 ఎకరాల భూములను డేటా సెంటర్‌ కోసం కేటాయించడంపై రాజేంద్రసింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవస్థానం ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామి ఆస్తుల విషయంలో చట్టబద్ధమైన విధానాలు, పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పంచగ్రామాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న వేలాది మంది పేదల ఇళ్ల సమస్యను పరిష్కరించని పాలకులు.. డేటా సెంటర్‌ కోసం వందల ఎకరాల భూమిని కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు.  

కొండలు ధ్వంసమైతే నీటి ముప్పు 
ముడసర్లోవ, కంబాలకొండ, తర్లువాడ, గంభీరం గెడ్డ ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. కొండలు, అడవులు వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి జలవనరులను కాపాడతాయని వివరించారు. నిర్మాణాల కోసం కొండలను తవ్వడం, చెట్లను తొలగించడం వల్ల సహజ జల ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడి నీటి కొరతతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వివరించారు. 

ముడసర్లోవ జలాశయంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం పరిసరాల్లో నిర్మాణాల వల్ల అటవీ పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని పేర్కొ­న్నారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు.

డేటా సెంటర్లతో నీటి వినియోగం.. వాతావరణంపై ప్రభావం
విశాఖలో భారీ సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పా­టుకు జరుగుతున్న యత్నాలు భవిష్యత్తులో నీటి లభ్యత, విద్యుత్‌ వినియోగం, స్థానిక వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో సమగ్రంగా పరిశీలించాలని రాజేంద్రసింగ్‌ సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఎయిర్‌ కూలింగ్‌ సాంకేతికతను ఉపయోగిస్తామని చెబుతున్నప్పటికీ, దాని పర్యావరణ ప్రభావాలనూ అంచనా వేయాల్సి ఉందన్నారు. ప్రకృతి సంపదను నాశనం చేసి అభివృద్ధి సాధించలేమని స్పష్టం చేశారు. 

పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన సూచనలను అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులు పాటించాలని కోరారు. గతంలో ముడసర్లోవ జలాశయంలో నీటి సమస్య తలెత్తినప్పుడు సింహాచలం కొండల నుంచి నీరు చేరే మార్గాలకు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నాలు చేసినట్లు గుర్తుచేశారు. పచ్చదనం, నీటి వనరుల పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జల్‌ బిరాదరి జాతీయ కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement