
సినిమా ఆడితేనే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు డ్యామేజ్ జరగదు
అందుకు మళ్లీ మళ్లీ చూడండి.. అందరికీ చూపించండి
మరో ఐదురోజులు ఈ సినిమాకు అనుకూల ప్రచారం చేయండి
ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు దిశానిర్దేశం
పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోండి
రోజూ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీస్తూ హాళ్లు నిండేలా చూడండి
జనసేన శ్రేణులతో మంత్రులు నాదెండ్ల, కందుల, ఎమ్మెల్సీ హరిప్రసాద్ టెలీకాన్ఫరెన్స్
సామాజిక మాధ్యమాల్లో వీరి ఆడియో క్లిప్పులు వైరల్
సాక్షి, అమరావతి/చిలకలపూడి (మచిలీపట్నం): రాజకీయాల కోసం ఇప్పటివరకూ సినిమాను వాడుకోవడాన్ని చూశాం. ఇప్పుడు సినిమా హిట్ కోసం ఏకంగా తమ పార్టీని.. పార్టీ శ్రేణులను ఉపయోగించుకునే సరికొత్త ఒరవడికి జనసేన తెరలేపింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టర్ ఫ్లాప్ అని టాక్ రావడం.. కలెక్షన్లూ దారుణంగా పడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వార్తలు వస్తుండడంతో తమ అధినేత పరువు నిలబెట్టే బాధ్యతను ఆ పార్టీ భుజానకెత్తుకుంది.
ఇందులో భాగంగా.. రాజకీయ సభలకు జనాలను తరలించేందుకు పార్టీలు నేతలతో టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహించినట్లుగానే జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఈ సినిమా హిట్ కోసం వరుస టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. సినిమాపై పూర్తి నెగిటివ్ టాక్ రావడం.. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ఏదో విధంగా సినిమాకు హిట్ టాక్ తెచ్చేందుకు వీరు రంగంలోకి దిగారు. జనసైనికులు, వీరమహిళలు అందరూ పెద్దఎత్తున పవన్ తాజా సినిమాను సపోర్టు చేయాలని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తద్వారా పవన్‌కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుందని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వీరి ఆడియో క్లిప్‌లు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌కు రెండ్రోజుల ముందు నుంచి ఇప్పటివరకు ఇలా రెండు మూడుసార్లు ఈ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పవన్ ఇమేజ్ తగ్గకుండా చూడాలి : నాదెండ్ల
నాదెండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడితేనే పవన్‌కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉంటుందని, అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరిపైనే ఉందన్నారు. ఇందుకోసం సినిమా మరికొన్ని రోజులు నడిచేలా చూడాలని.. ప్రజలందరు కూడా చూసేలా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. అలాగే, జనసేన నాయకులకు ప్రజల్లోకి వెళ్లగలిగే అవకాశం అధినేత తాజా సినిమా (పేరు చెబుతూ) ద్వారా దొరికిందన్నారు. అధినేత సినిమా విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు సినిమా విజయవంతానికి కష్టపడిన తీరును మొన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లానని.. సినిమా విజయవంతం చేసే కార్యక్రమాన్ని ఇంకో నాలుగైదు రోజులు కొనసాగించాలంటూ నాదెండ్ల మనోహర్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అలాగే, పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలన్నారు.
ఒకటికి రెండుసార్లు చూడండి.. అందరికీ చూపించండి : కందుల దుర్గేష్
మరో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సినిమా బాగుందని విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒకటి, రెండుసార్లు సినిమా చూసి, మరికొంత మందిని తీసుకెళ్లడం అవసరమని టెలీకాన్ఫరెన్స్‌లో తెలిపారు. మరోవైపు.. పార్టీ శ్రేణులే డబ్బులు పెట్టి ప్రజలను సినిమాకు పంపాలని ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్పారు. ప్రతీ జనసైనికుడు ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువసార్లు చూడాలన్నారు. ప్రతీ థియేటర్‌కు వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీసి రోజూ హాలు నిండేలా చూడాలని చెప్పారు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంవల్ల దానిని అధిగమించేందుకు సక్సెస్ మీట్ నిర్వహించారని వివరించారు. రానున్న ఐదు రోజులపాటు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి సినిమాను బాగుందనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యే ఒకరు సినిమా రిలీజు తర్వాత తాను ఎన్ని థియేటర్ల వద్దకు వెళ్లి సినిమా పరిస్థితి గురించి తెలుసుకున్న వివరాలు వివరించారు.