పాతికేళ్లుగా పాగా!

TDP Leaders 17 Acres Land Kabza In Srirangarajapuram, Chittoor - Sakshi

ఎస్‌ఆర్‌పురంలో టీడీపీ నేతల భూబాగోతం

17.36 ఎకరాలు యథేచ్ఛగా కబ్జా

ప్లాట్లు వేసి విక్రయిస్తున్న అక్రమార్కులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ రాబందులు రెచ్చిపోయారు.. పలుకుబడిని ఉపయోగించారు.. నిబంధనలను తుంగలో తొక్కారు.. పంచాయతీని గుప్పెట్లో పెట్టుకున్నారు.. రూ.కోట్ల విలువైన సర్కార్‌ భూమిలో పాగా వేశారు.. కబ్జాదారులకు అప్పటి అధికారులు కొమ్ముకాశారు.. ప్రస్తుతం ప్రభుత్వంలో తమ్ముళ్ల భూ బాగోతంపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.. పాతికేళ్ల ఆక్రమణల ప్రస్థానంపై వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులే విస్తుబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 

సాక్షి, తిరుపతి: శ్రీరంగరాజపురం మండలకేంద్రంలో 17.36ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం ఆ భూమిని స్థానిక టీడీపీ నేత ఎం.కృష్ణమనాయుడు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకుని యథేచ్ఛగా సాగుచేసుకుంటున్నారు. మండలకేంద్రానికి 2కి.మీ పరిధిలోని ప్రభుత్వ భూములను ఎవరికీ పంపిణీ చేయకూడదనే జీఓ ఉన్నా ఉమాపతినాయుడు అనే వ్యక్తితో కలిసి కృష్ణమనాయుడు ఆ భూమిని తమకు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై అప్పటి కలెక్టర్‌ వెంటనే విచారణకు ఆదేశించారు. భూమికోసం అర్జీ పెట్టుకున్నవారు భూస్వాములను విచారణలో తేలింది. దీంతో వారి కబ్జాలో ఉన్న 17.36 ఎకరాలను ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసి, మిగిలిన భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలు అమలు కాకుండా కబ్జాదారులు అడ్డుకున్నారు.

నిరుపేదలకు దక్కాల్సిన భూమిని సొంతం చేసుకునేందుకు కృష్ణమనాయుడు ప్రయత్నాలు ఆపలేదు. వయసు మీద పడడంతో అప్పటి టీడీపీ మండలాధ్యక్షుడు ఎం.భాస్కర్‌నాయుడు సహకారం తీసుకున్నాడు. 2009లో భాస్కర్‌నాయుడు భార్య ఝాన్సీ సర్పంచ్‌గా ఎన్నికైంది. ఇదే అవకాశంగా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పావులు కదిపారు. జీఓ635 ప్రకారం పంచాయతీలో తీర్మానం చేయించి కలెక్టర్‌కు పంపించారు. భాస్కర్‌నాయుడు, ఝాన్సీ తోడికోడలు హైమావతి, కృష్ణమనాయుడు కుమార్తెలు ఆండాళమ్మ, తులసమ్మ నిరుపేదలని వారికి సదరు భూమిని పంపిణీ చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఆ సమయంలో తులసమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఆండాళమ్మ బెంగళూరులో కాపురముంటోంది. అయినప్పటికీ పంచాయతీ తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏపీఎల్‌ఎంఏ కమిటీ సిఫార్సులను తెప్పించుకుని ఆ భూమిని కొనుగోలు చేసుకునేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో..
సర్వే నంబర్‌    విస్తీర్ణం (ఎకరాల్లో)
28/2ఏ  -  3.51
28/2బి  - 3.49
28/3ఏ  -  5.20
28/3బి  -  5.16
మొత్తం  - 17.36 

తర్వాత రూ.కోట్ల విలువైన భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున బినామీల పేరిట ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకుని పేదల నోరు కొట్టేశారు. వ్యవసాయం పేరుతో కాజేసిన భూమిని భాస్కర్‌నాయుడు తన బినామీల నుంచి తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఇతరులకు విక్రయించాలంటే కలెక్టర్‌ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. చూసేవారికి అనుమానం రాకుండా భూమి చుట్టూ మామిడి చెట్లు పెంచారు. లోపల ఓ ప్రైవేట్‌ స్కూల్‌ను సైతం నిర్వహిస్తున్నారు. మిగిలిన భూమిలో ప్లాట్లు వేసి విక్రయాలు ప్రారంభించారు. సరైన పత్రాలు లేకపోయినా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారులను మమూళ్లతో జోకొట్టి భాస్కర్‌నాయుడు అక్రమాలు సాగిస్తున్నారు. ఈ మొత్తం భూభాగోతంపై గ్రామస్తులు ఇటీవలే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top