కోర్టుల మితివీురిన జోక్యం రాజ్యాంగ అతిక్రమణే

Tammineni Sitaram Comments About Courts - Sakshi

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

న్యాయస్థానాలు స్వీయ నియంత్రణ పాటించాలి

వడోదరలో ప్రారంభమైన ‘అఖిల భారత స్పీకర్ల సదస్సు’లో ఉపన్యాసం

సాక్షి, అమరావతి: శాసన వ్యవస్థ హక్కులు, అధికారాల్లో న్యాయస్థానాలు మితిమీరి జోక్యం చేసుకోవడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ జోక్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అవరోధాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ‘అఖిల భారత స్పీకర్ల సదస్సు’ ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో మొదటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలతో పాటు అన్ని రాష్ట్రాల స్పీకర్లు పాల్గొన్నారు.

ఈ సదస్సులో స్పీకర్‌ తమ్మినేని మాట్లాడుతూ.. వ్యవహారపరమైన లోపాలున్నాయనే ఆరోపణల ఆధారంగా శాసనసభ వ్యవహారాలు, నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 212 విస్పష్టంగా పేర్కొందన్నారు. అందుకు విరుద్ధంగా ఇటీవల న్యాయస్థానాలు తరచూ శాసన వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వస్తుండటం రాజ్యాంగ అతిక్రమణే అని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభ ఆమోదించిన ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, ‘సీఆర్‌డీయే చట్టం రద్దు బిల్లు’లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బిల్లుల అంశంలో రాష్ట్ర శాసనసభ, మండలి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక వ్యవస్థ, నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయని, ఈ అంశంలో కొందరు రాజకీయ దురుద్దేశంతోనే న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. ఇలాంటి కేసులను విచారించే ముందు వాటి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను న్యాయస్థానాలు పరిశీలించాలని సీతారాం కోరారు. 

పరిపాలన ముందుకు సాగేదెలా..
కీలక, సున్నితమైన అంశాలు రాగానే వాటిపై వెంటనే వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగ వ్యవస్థలు సిద్ధంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందని కూడా స్పీకర్‌ సీతారాం అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో కూలంకషంగా చర్చించిన తర్వాత పాస్‌ చేసిన బిల్లులు అమలు కాకపోవడం బాధిస్తోందని, సభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారి అమలుకాకపోతే పరిపాలన ముందుకు సాగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ దురుద్దేశ పూర్వకంగా కోర్టులను ఆశ్రయించడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడి.. రాజ్యాంగ వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటోందని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధులను గుర్తించి ఒకదానిని ఒకటి గౌరవిస్తేనే రాజ్యాంగంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top