మెగా జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

Take Advantage Of The Mega Job Fair - Sakshi

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేది పల్లవోలు సమీపంలోని సీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ కె. సురేష్‌ బాబు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం అపూర్వ కల్యాణ మండపంలో జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్‌ మేళాల ద్వారా 42వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, బద్వేల్‌లో సెంచరీ ప్లైవుడ్‌ కంపెనీ రూ.1000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూ.800 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, 15 కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయన్నారు. ఈనెల 25వ తేదీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐటీలో నిర్వహించే జాబ్‌మేళాలో 250 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివిన నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థులు వైఎస్‌ఆర్‌సీపీ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, రాణాప్రతాప్, నాగేంద్ర, దత్తసాయి, రహీమ్, యల్లారెడ్డి, షఫీ పాల్గొన్నారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top