నిబంధనలు గాల్లో.. ప్రాణాలు ‘పూల్‌’లో..

Swimming Pools At Hotels And Resorts In Visakhapatnam - Sakshi

విశాఖలో 30కిపైగా హోటల్స్, రిసార్టుల్లో స్విమ్మింగ్‌పూల్స్‌ 

నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు 

ఏ ఒక్క పూల్‌ వద్ద లైఫ్‌గార్డ్‌ని నియమించని వైనం 

కచ్చితంగా లైఫ్‌గార్డులు ఉండాల్సిందేనని శాప్‌ తాజా ఆదేశాలు 

సాక్షి, విశాఖపట్నం: స్విమ్మింగ్‌ పూల్‌.. ఎక్కడ కనిపించినా ఈత కొట్టాలన్న ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్‌ హోటల్స్, రిసార్టుల్లో బస చేసే ముందు అందరూ అడిగేది ఒక్కటే.. మీ దగ్గర స్విమ్మింగ్‌పూల్‌ ఉందా అని. అంతలా ఆకర్షిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌కి అనుగుణంగా లైఫ్‌గార్డులు ఉన్నారా..? నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఫలితంగా సరదా స్విమ్మింగ్‌ ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. గురువారం నగరంలోని ఓ ప్రైవేట్‌ రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తూ తొమ్మిదేళ్ల చిన్నారి జారిపడి మృత్యువాత పడింది. ఈ ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నగరంలోని రిసార్టులు, హోటల్స్‌లో గల స్విమ్మింగ్‌పూల్స్‌ వద్ద లైఫ్‌గార్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) తాజాగా నోటీసులు జారీ చేసింది. 

కనిపించని లైఫ్‌గార్డులు 
నగరంలో ప్రైవేట్‌ హోటల్స్, రిసార్టుల్లో సుమారు 30కి పైగా స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతి స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కచ్చితంగా పూల్‌ సామర్థ్యం బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. కానీ ఏ ఒక్క ఈత కొలను వద్ద ఒక్క లైఫ్‌గార్డుని కూడా ఆయా యాజమాన్యాలు నియమించలేదు. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే హోటల్, రిసార్టుల్లో పని చేసే సిబ్బందిని వినియోగించుకుంటున్నారే తప్ప.. నిబంధనలను మాత్రం పాటించడం లేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. 

సామర్థ్యాన్ని బట్టి.. లైఫ్‌గార్డులు 
హోటల్స్, రిసార్టుల్లో బస చేస్తున్న వారి సామర్థ్యాన్ని బట్టి లైఫ్‌గార్డులు ఉండాలి. స్విమ్మింగ్‌పూల్స్‌ వద్ద స్విమ్మింగ్‌ ఫ్లోటింగ్‌ ట్యూబ్స్, స్టిక్స్‌ అందుబాటులో ఉంచాలి. పిల్లలు ఈతకొట్టేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్‌ సేవర్స్‌ కచ్చితంగా ఉంటేనే ఈత కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి.

లేదంటే ఆ రోజు స్విమ్మింగ్‌ పూల్‌ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలి. పూల్‌ సైజ్, స్విమ్మర్స్‌ ఎంత మంది వినియోగించుకుంటున్నారనే విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఒకటి నుంచి నలుగురు లైఫ్‌గార్డుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ఒక్క దాంట్లోనూ లైఫ్‌ సేవర్స్‌ లేకపోవడం శోచనీయం. 

నిబంధనలపై శాప్‌ నోటీసులు 
ప్రతి పూల్‌లో గార్డులను ఏర్పాటు చేయాలని ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ(శాప్‌) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్విమ్మింగ్‌పూల్‌ నిర్వాహకులకు నోటీసులు అందిస్తోంది. పూల్‌ సామర్థ్యానికి అనుగుణంగా లైఫ్‌గార్డుల్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం రాష్ట్రీయ లైఫ్‌ సేవింగ్స్‌ సొసైటీ(ఏపీఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌) అందించే స్విమ్మర్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.  

నిర్లక్ష్యం తగదు 
ప్రైవేట్‌ స్విమ్మింగ్‌పూల్స్‌లో చాలా వరకూ నిబంధనలు పాటించడం లేదు. పీఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో లైఫ్‌గార్డులకు శిక్షణ అందిస్తున్నాం. శాప్‌ ఆధ్వర్యంలో వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తున్నాం. పూల్స్‌ వద్ద లైఫ్‌గార్డులు ఉంటే.. విషాద ఘటనలు ఇకపై ఏ ఈత కొలను వద్ద కూడా చోటుచేసుకోవు.  
– బలరాం, రాష్ట్రీయ లైఫ్‌ సేవింగ్స్‌ సొసైటీ ఏపీ అధ్యక్షుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top