Duvvada Railway Station: శశికళ.. గుండె విలవిల

Student Sasikala Stuck between platform and Train, Died - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: లేకలేక కలిగిన సంతానం ఆ అమ్మాయి. అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. విధి చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయి ప్రాణాలను హరించింది. అనకాపల్లి జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం గుంటూరు – రాయగడ∙ఎక్స్‌ప్రెస్‌ దిగుతూ జారి పడి, ప్లాట్‌ఫాం – రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయి.. గంటన్నర పాటు అంతులేని బాధ పడిన మెరపల శశికళ (22) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది.

శరీరం నలిగిపోయి అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె మృతి సమాచారం తెలియడంతో అన్నవరం వెలంపేటలో విషాద ఛాయలు అలముకొ న్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రేషన్‌ డీలర్‌ మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి కుమార్తె శశికళ చిన్నప్పటి నుంచీ చదువులో దిట్ట. బొమ్మలేయడంలో కూడా మంచి ప్రతిభ ప్రదర్శించేది. తుని ఆదిత్యలో బీసీఏ చదివింది. గత నెలలో దువ్వాడ విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఎంసీఏ కోర్సులో చేరింది. రోజూ అన్నవరం నుంచి దువ్వాడ వరకూ రైలులో వెళ్లి వచ్చేది. ఇలా తిరగడం ఇబ్బందిగా ఉందని, హాస్టల్‌లో ఉంటానని ఇంట్లో చెప్పింది.

ఈ నేపథ్యంలో బుధవారం బయలుదేరి వెళ్లిన శశికళ దువ్వాడలో ట్రైన్‌ నుంచి జారి పడిపోయింది. కిందకు దిగే ప్రయత్నంలో రైలు కుదుపునకు బోగీ తలుపు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో శశికళ అదుపు తప్పి పడిపోయిందని సమాచారం. ఆమె మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బంధువులు విశాఖ బయలుదేరారు. తల్లితండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం శశికళ మృతదేహాన్ని గురువారం రాత్రి అన్నవరం తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి, పుట్టెడు దుఃఖంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున విలపించారు. శశికళ మృతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: (దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడిన విద్యార్థిని మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top