
అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థత
బ్రహ్మసముద్రం పీహెచ్‌సీలో కరెంటు లేక గంట పాటు ఆక్సిజన్ అందని వైనం
కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తరలింపు... చికిత్స పొందుతూ మృతి
సకాలంలో ఆక్సిజన్ పెట్టి ఉంటే బతికేదంటూ కుటుంబ సభ్యుల రోదన
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం... ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందకపోవడం... ఓ విద్యార్థిని ప్రాణాన్ని బలిగొంది. తమ బిడ్డను మంచి చదువులతో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న తల్లిదండ్రుల కలల్ని కల్లలు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి (గొల్లలదొడ్డి)లో ఉంటున్న మహేష్, పద్మక్కకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె జి.చందన (14) బ్రహ్మసముద్రం కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
గురువారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తెల్లారేవరకు ఇబ్బంది పడింది. తర్వాత విధుల్లో ఉన్న సిబ్బందికి తెలిపింది. సిబ్బంది ఉదయం ఆరు గంటలకు చందన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వెంటనే వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని తండ్రికి సూచించారు. 9 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మహేష్, కుటుంబసభ్యులు చందనను బ్రహ్మసముద్రంలోని ప్రైవేట్ వైద్యుడి వద్దకు, తర్వాత పీహెచ్‌సీకి తరలించారు. అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించేందుకు కరెంటు లేదు.
గంటపాటు వేచి ఉన్నా విద్యుత్తు రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సూచన మేరకు అంబులెన్స్‌లో ఉదయం 10.30కు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షలు చేసి చికిత్స అందించారు. 11.15 ప్రాంతంలో చందన మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేజీబీవీకి వెళ్లి వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
కాగా, చందన మృతదేహాన్ని ఆర్డీటీ ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పోలీసులు ఇలా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చందన చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. శుక్రవారం సాయంత్రం చందన మృతదేహాన్ని స్వగ్రామం పడమటి కోడిపల్లి (గొల్లలదొడ్డి)కి తీసుకెళ్లిన అనంతరం ఒక్కసారిగా ఆగ్రహంతో బ్రహ్మసముద్రం కేజీబీవీ వద్దకు చేరుకున్నారు.
ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లోకేష్ పాఠశాల గేట్లకు తాళం వేసి ఎవ్వరినీ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. విద్యార్థిని బంధువులు అక్కడే బైఠాయించారు. తహసీల్దార్ సుమతి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వెంటనే చెప్పి, ఆక్సిజన్ పెట్టి ఉంటే బతికేది
చందనకు మూడేళ్ల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించాం. గురువారం అర్ధరాత్రి నుంచే ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడింది. కసూ్తర్బా సిబ్బంది ముందే సమాచారం ఇచ్చి ఉంటే బిడ్డను బతికించుకునేవాళ్లం. కేజీబీవీ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకనే చందన చనిపోయింది. – నరసింహమూర్తి, చందన చిన్నాన్న