విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..

Student Dies, Two Hospitalized Of Snake Bite In Vizianagaram - Sakshi

కురుపాం/విజయనగరం ఫోర్ట్‌: రాత్రి 10 గంటల వరకు అందరూ ఒక్కచోటే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు... 8వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించారు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కట్ల పాము రూపంలో మృత్యువు గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి గదిలోకి ప్రవేశించింది. వరుసగా నిద్రపోతున్న విద్యార్థుల్లో ముగ్గురిని కాటేసింది.

విద్యార్థులు వెంటనే మేల్కొన్నారు. పామును గమనించారు. కేకలు వేయడంతో మిగిలిన విద్యార్థులు కర్రతో దానిని హతమార్చారు. వసతిగృహ సిబ్బంది సహాయంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నా ఒక విద్యార్థి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం...  

కురుపాం మండల కేంద్రంలో ఉన్న మహా త్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్‌కుమార్, సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడు పేటకు చెందిన వంగపండు నవీన్‌లతో పాటు మరో 9 మంది వసతిగృహం డార్మిటరీ గదిలో నిద్రపోతున్నారు. అర్ధారాత్రి తర్వాత కట్లపాము వరుసగా నిద్రపోతున్న రంజిత్‌కుమార్, వంశీ, నవీన్‌ల ముక్కు, కంటి, వీపుమీద కాటేసింది.

వారు వసతిగృహంలో ఉన్న ప్రిన్సిపాల్‌ బిర్లంగి సీతరామ్, ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేశారు. వసతిగృహ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనంపై కురు పాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్‌ (13) మృతి చెందాడు. మిగిలిన వారి  పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.  

ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..
మహాశివరాత్రికి ఇంటికి వచ్చావు.. అందరితో కలిసి సరదాగా గడిపావు.. పామునోట పడేందుకే వసతిగృహానికి వెళ్లావా అంటూ రంజిత్‌కుమార్‌ తల్లి సన్యాసమ్మ విలపిస్తున్న తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. నా ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకున్నాను.. నాకు దేవుడు అన్యాయం చేశాడు.. మంచి వాళ్లనే  తీసుకుపోతాడంటూ బోరున విలపిస్తోంది. విద్యార్థి తండ్రి కృష్ణ ఆస్పత్రి వద్దే కుప్పకూలిపోయారు. రంజిత్‌ మృతితో వసతిగృహంతో పాటు స్వగ్రామం దళాయిపేటలో విషాదం అలముకుంది.

విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్‌ ఆరా:
కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు.  కోలుకునేలా సేవలందించాలని వైద్యులకు సూచించారు.  

విద్యార్థి మృతి బాధాకరం  
పాముకాటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఒక విద్యార్థి మృతిచెందడం బాధాకరమన్నారు. రంజిత్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.

పాముకరిచిందని విద్యార్థులు తెలిపిన వెంటనే ప్రిన్సిపాల్‌ స్పందించారన్నారు. విద్యార్థులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బీసీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిందని, అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని జెడ్పీ చైర్మన్‌ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సదుపాయాలతో కూడిన శాశ్వత వసతి కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top