మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ నంద్యాల జిల్లా డోన్, నెల్లూరు జిల్లా కోవూరులో కదంతొక్కిన విద్యార్థులు, ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు
స్వచ్ఛందంగా వేలాదిగా కదలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు
17 నెలల్లో చేసిన రూ.2.50 లక్షల కోట్ల అప్పులో కేవలం రూ.5 వేల కోట్లు వీటి కోసం ఖర్చు చేయలేరా?
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తారా?
తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలి..
ప్రజాగ్రహ జ్వాలల్లో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోతుందంటూ నినాదాలు
తరలి వచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి కదంతొక్కిన జనం
ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. 
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. 
ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్‌సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. 
ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. 
పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్‌ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది.


నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. 
చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. 
విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ
మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్‌సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. 
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు.


