
శాంతియుత ఆందోళనలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు?
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
నిరసన తెలుపుతున్న వారిపై ఎందుకు లాఠీచార్జ్ చేశారు?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుతంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..
» చంద్రబాబు గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్‌సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? ఎందుకు లాఠీచార్జ్ చేశారు? గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా?
» మీరు స్కాములు చేస్తూ ప్రజల ఆస్తులైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచి వేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వెలుపల కూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసిస్తుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం?
» మీరింతగా తెగబడినా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితోపాటు యువతీ యువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలో, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలో విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు ఉధృతంగా కొనసాగుతాయి.
