పీపీపీపై ప్రజాగ్రహం | YSRCP Chalo Medical College program success | Sakshi
Sakshi News home page

పీపీపీపై ప్రజాగ్రహం

Sep 20 2025 4:46 AM | Updated on Sep 20 2025 4:45 AM

YSRCP Chalo Medical College program success

పులివెందుల మెడికల్‌ కాలేజీ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పోలీసులు అడ్డుకుంటున్నా కదంతొక్కిన జనం

వైఎస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమం విజయవంతం

వైఎస్‌ జగన్‌ పిలుపుతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత 

అడ్డుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కూటమి సర్కార్‌ 

వైఎస్సార్‌సీపీ నేతల నిర్బంధం.. కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులు 

వాటిని లెక్క చేయక మెడికల్‌ కాలేజీల వరకు కొనసాగిన భారీ ర్యాలీలు 

సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

ర్యాలీలను భగ్నం చేసేందుకు పలుచోట్ల లాఠీలు ఝుళిపించిన పోలీసులు 

అయినా వెనక్కు తగ్గక మెడికల్‌ కాలేజీల వద్దకు వెళ్లి నిరసన 

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్‌  

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సామాన్యులకు వైద్య విద్యను దూరం చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి జనం కదంతొక్కారు. మెడికల్‌ కాలే­జీలను ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణ­మే ఉపసంహరించుకోవాలని.. జీవో 590ను రద్దు చేయా­లని.. పీపీపీ బాబూ.. సిగ్గు సిగ్గు.. అంటూ నినా­దాలు చేశారు. 

రాష్ట్రంలో 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వైద్య సేవలను మెరుగుపర్చటం.. సామాన్యులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు కాలేజీలు 2023–24 సంవత్సరంలోనే ప్రారంభించారు. పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీల నిర్మా­ణం అప్పటికే పూర్తయింది. గత ఏడాది పాడేరు మెడి­కల్‌ కాలేజీ ప్రారంభమైంది. మిగతా పది మెడికల్‌ కాలేజీల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 

అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు మిగిలిన పను­లను ఉద్దేశ పూర్వకంగా పూర్తి చేయ­లేదు. పది మెడికల్‌ కాలేజీలను ముడు­పుల కోసం సన్నిహి­తులకు కట్ట­బెట్టేందుకు వాటిని ప్రైవేటీకరించాలని సీఎం చంద్ర­బాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ  ఉద్యమం చేపట్టాలని వైఎస్‌ జగన్‌ పిలుపు­నిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకో­వడానికి టీడీపీ కూటమి సర్కార్‌ యధావిధిగా అధి­కార దుర్వినియో­గా­నికి పాల్పడుతూ పోలీసులను ప్రయోగించింది. 

ఎక్కడికక్కడ అడ్డంకులు
వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెది­రించారు. నిర్బంధాలను ఛేదించుకుని.. బెది­రింపులకు బెదరకుండా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్య­కర్తలు కదంతొక్కారు. ఈ ర్యాలీలకు సామా­న్య ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. మెడికల్‌ కాలేజీల వద్దకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సామన్య ప్రజలపై పోలీసులు లాఠీలను ఝుళిపించారు. 

పోలీసుల లాఠీల దెబ్బలకు జడవకుండా సర్కార్‌పై రణభేరి మోగించారు. ‘పీపీపీ వద్దు.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ముద్దు.. ప్రయివేటీకరణ నిర్ణ­యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రయివేటుపరం.. సామాన్యు­డికి ఉన్నత చదువు దూరం..’ నినా­దాలతో కూడిన ప్ల కార్డులతో ప్రజలు ర్యాలీల్లో కవాతు చేశారు. ‘ముడు­పుల కోసం ప్రజల ఆస్తులు అమ్మేస్తారా సిగ్గు సిగ్గు.. సంపద సృష్టికర్త కాదు.. చంద్రబాబు సంపద దోపిడీ కర్త’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

వైఎస్సార్‌సీపీ నిర్వహించిన చలో మెడికల్‌ కాలేజ్‌ కార్యక్రమానికి ఎక్కడ చూసినా తండోప తండాలుగా జనం కదంతొక్కిన తీరు సర్కారు పెద్దల్లో గుబులు రేపింది. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు ఈ నిరసనలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తోపులాటలు, నిర్బంధాలు
» కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తోపులాటలు, అడ్డగింతలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి మెడికల్‌ కళాశాలకు వెళ్లే అన్ని రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. లాఠీలు ఝుళిపించారు. సామాన్య ప్రజలను సైతం అటువైపు వెళ్లనివ్వలేదు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు, ప్రజలు రోడ్డుపై బైఠా­యించి నినాదాలు చేశారు. నగరంలోకి రాని­వ్వకుండా నగర శివార్లలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా జనం పాల్గొన్నారు. దీంతో 400 మందిపై మచిలీ­పట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.

»  పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మెడికల్‌ కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి భారీగా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివ­చ్చారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రజా పోరును అడ్డుకునే ప్రయత్నం చేశారు. మెడికల్‌ కళాశాల వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేçషన్‌కు తరలించారు. గురు­వారం రాత్రి నుంచే పలువురు నేతలకు పోలీ­సులు నోటీసులు అందజేసి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయ­వరం మెడికల్‌ కాలేజీ వద్ద పార్టీ నేతలు, ప్రజలు కదం తొక్కారు. 

»    రాజమహేంద్రవరం వైద్య కళాశాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నేతలు సమాయత్త­మ­వుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్క­డికి వెళ్లనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్‌ సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలను పోలీసులు బలవంతంగా లాగేశారు. 

» పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్‌ దగ్గు­లూరులో నిర్వహించిన ‘చలో మెడికల్‌ కళాశాల’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మెయిన్‌ రోడ్డు నుంచి కళాశాల ఆవరణ వరకు కిలోమీటరు మేర ప్ల కార్డులతో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు వెల్లువలా తరలి వచ్చారు. 

» విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడు­గడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా.. ‘చలో ­మెడికల్‌ కాలేజీ’ విజయవంతమైంది. అన­కాç­³ల్లి జిల్లా  మాకవరపాలెం మండలం భీమ­బో­యినపాలెంలో గల మెడికల్‌ కళాశాల వద్ద ప్రయి­వే­టీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఏలూ­­రులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వద్ద వైఎస్సార్‌­సీపీ శ్రేణులు, ప్రజలు ఆందోళన నిర్వహించారు. కాలేజీకి నాలుగు వైపులా బారికేడ్లు పెట్టారు. 150 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపోకలను నిలువరించారు. 

నంద్యాల్లో 1,500 మంది పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
నంద్యాలలో ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పలువురు నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన 1,500 మందిని బలవంతంగా జీపుల్లో, లారీల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. 

ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, విద్యార్థులు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌ సమీపంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన మెడికల్‌ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

దద్దరిల్లిన మదనపల్లె, పులివెందుల
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిరసన కార్యక్రమం విజయవంతమైంది. మెడికల్‌ కాలేజీ వద్ద నిర్వహించిన ఆందోళనకు అనూహ్య స్పందన లభించింది. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో విద్యార్థి లోకం గర్జించింది. 

వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన, విద్యార్థి, సోషల్‌ మీడియా, వలంటీర్‌ విభాగాలు, అనుబంధ విభాగాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పులివెందుల మెడికల్‌ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement