బడ్జెట్ బయట అప్పులు ఏకంగా రూ.1,02,533 కోట్లు
ఇందులో కార్పొరేషన్ల పేరుతో అప్పులు రూ.62,533 కోట్లు
అమరావతి రాజధాని పేరుతో రూ.40,000 కోట్లు
బ్యాంకుల ద్వారా పౌర సరఫరాల సంస్థ కొత్తగా రూ.5,000 కోట్లు అప్పు
పౌర సరఫరాల సంస్థకు అనుమతి గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ
పౌర సరఫరాల సంస్థ అప్పు గరిష్ట పరిమితి రూ.44 వేల కోట్లకు పెంపు
అమరావతి రాజధాని పేరుతో కొత్తగా రూ.9,000 కోట్ల అప్పు
ఇందులో ఏపీపీఎఫ్‌సీఎల్ నుంచి రూ.1500 కోట్లు.. ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ నుంచి రూ.7,500 కోట్లు
బ్యాంకు నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొత్తగా రూ.1,000 కోట్లు అప్పు
బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు రూ.1,150 కోట్లు
వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి : బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశాల్లో ఆమోదించడం.. ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయడం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది. కొత్తగా అమరావతి రాజధాని, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్), విద్యుత్ సంస్థల పేరుతో.. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.16,150 కోట్ల అప్పులు చేయడానికి బుధవారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.
దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో రూ.1,02,533 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారెంటీ అప్పులు రూ.62,533 కోట్లు ఉండగా, అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో రూ.40,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని అప్పట్లో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుగా చిత్రీకరించాయి.
అయితే బాబు సర్కారు బడ్జెట్ బయట కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.1,02,533 కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వ గ్యారెంటీలతో జీవోలు జారీ చేసినా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించడం లేదు. వాస్తవంగా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ బయట అప్పులు చేసింది. ఆ అప్పులను తప్పుగా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేశారు.
ఎడాపెడా ఉత్తర్వులు
వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్లు అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా పౌర సరఫరాల సంస్థ అప్పుల గరిష్ట పరిమితిని రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఏపీపీఎఫ్‌సీఎల్ రూ.1,000 కోట్ల అప్పు తీసుకునేందుకు అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బొగ్గు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఈ అప్పు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పింది. డిస్కమ్స్ (విద్యుత్ సంస్థలు) వివిధ బ్యాంకుల నుంచి రూ.1,150 కోట్ల అప్పులు చేసేందుకు అసలుకు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధానిలో పనుల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఎబీఎఫ్‌ఐడీ) నుంచి రూ.7,500 కోట్లు అప్పు చేసేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ అప్పుకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీని తీసుకుని రుణ ఒప్పందం చేసుకోవాల్సిoదిగా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఉత్తర్వుల్లో సూచించింది. అలాగే రాజధాని పనుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,500 కోట్లు అప్పు తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ అప్పునకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీ తీసుకుని అప్పు ఒప్పందం చేసుకోవాల్సిoదిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు అప్పులు


