
బాబు సర్కారు ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన ‘కాగ్’
2025–26 తొలి 5 నెలల బడ్జెట్ గణాంకాల వెల్లడి
కేంద్ర గ్రాంట్లలో రూ.16,055.44 కోట్లు తగ్గుదల
ఏకంగా రూ.55,932 కోట్లకుపైగా అప్పులు
రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఎగబాకడమేగానీ తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: అప్పుల వృద్ధిలో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. 15 నెలలుగా రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వంలో వచ్చిన సంపద కూడా రాకుండా పోతోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి అమ్మకం పన్ను తిరోగమనమే గానీ పెరగడం లేదు. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే. మరోవైపు సామాజిక రంగం, మూలధన వ్యయం భారీగా తగ్గిపోయింది.
ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల (2025–26 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) బడ్జెట్ కీలక సూచికలతో గణాంకాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించింది. అప్పులు చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కాగ్ విడుదల చేసిన గణాంకాల మేరకు తొలి ఐదు నెలల్లోనే కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌ను మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది.
సాధారణంగా రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం అంతకు ముందు సంవత్సరాలతో పోల్చితే పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆగస్టు వరకు రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయంతో పోల్చితే 2025–26లో ఆగస్టు నాటికి బాబు పాలనలో రెవెన్యూ రాబడులు, బడ్జెట్ వ్యయం తగ్గిపోవడం గమనార్హం. రెవెన్యూ రాబడులు ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.8,752.11 కోట్లు తగ్గాయి. రాబడుల్లో 12.44 శాతం క్షీణత నెలకొంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. అస్తవ్యస్త పాలనతో రెవెన్యూ రాబడులు క్షీణిస్తున్నాయి. 2023–24 తొలి ఐదు నెలల కంటే బడ్జెట్ వ్యయం ఈ ఆర్థిక ఏడాదిలో రూ.10,663.43 కోట్లు తగ్గిపోయింది.
» టీడీపీ కూటమి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి. 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.16,055.44 కోట్లు తగ్గాయి. అంటే ఏకంగా 83.70 శాతం క్షీణించాయి. 2023–24లో వచి్చనవి కూడా ఇప్పుడు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతోంది.
» 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది అమ్మకం పన్ను రాబడి రూ.460 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను రాబడి 5.88 శాతం క్షీణించింది.
» 2023–24 తొలి ఐదు నెలలతో పోల్చితే ఇప్పుడు సామాజిక రంగ వ్యయం రూ.10,953.60 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 16.11 శాతం తగ్గింది. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయాన్ని సామాజిక
రంగ వ్యయంగా పరిగణిస్తారు.
మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తగ్గుదల..
అప్పుల్లో మాత్రం చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ ఆరి్ధక ఏడాది తొలి ఐదు నెలల్లోనే బడ్జెట్‌లో ఏకంగా రూ.55,932.68 కోట్ల అప్పులు చేసింది. నెలకు సగటున రూ.పది వేల కోట్లకు పైగా అప్పులు తీసుకుంటుండగా మూలధన వ్యయం కేవలం రూ.9,663.70 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి.

అదే 2023–24 తొలి ఐదు నెలల్లో వైఎస్సార్‌సీపీ హయాంలో మూలధన వ్యయం రూ.15,883.94 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కారు మూలధన వ్యయం రూ.6,220.24 కోట్లు తక్కువగా చేసినట్లు స్పష్టమవుతోంది. అది కూడా అటు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా.. ఇటు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంపై అంతులేని రుణభారం మోపుతుండటంపై ఆర్థిక వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎగబాకిన లోటు
రెవెన్యూ లోటు ఐదు నెలల్లోనే అదుపు తప్పింది. ఈ ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.33,185.97 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో పేర్కొనగా తొలి ఐదు నెలల్లోనే ఏకంగా రూ.41,635.63 కోట్లకు ఎగబాకింది. ఎడాపెడా అప్పులు చేస్తుండటంతో ద్రవ్యలోటు పెరిగిపోతోంది. రెవెన్యూ రాబడులు కోల్పోవడం, బడ్జెట్ వ్యయం కూడా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందనేందుకు సంకేతమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
