
సాక్షి,విజయవాడ: సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల సృష్టిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు నిలదీస్తుంటే చంద్రబాబు సంపద సృష్టించిన తర్వాతే అని వారు అంటున్నారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. అప్పుల్నే సంపద సృష్టిగా భావిస్తున్నట్లున్నారు. మంగళవారం వస్తే చాలు అప్పు సృష్టిస్తున్నారు.
ఈ మంగళవారం (సెప్టెంబర్ 30) రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. తద్వారా 16 నెలల్లోనే 2 లక్షల 11 వేల కోట్లతో దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన జాబితాలో చంద్రబాబు చేరారు. దీంతో చంద్రబాబు సర్కార్‌పై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.2 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేయగా.. వాటిలో లక్షా 35,700 కోట్లకు పైగా బడ్జెటరీ అప్పులు(అంటే ప్రభుత్వ బడ్జెట్‌లో చూపబడే అప్పులు) ఉన్నాయి. ఇలా చంద్రబాబు ప్రతి మంగళవారం చేసే వేల కోట్ల అప్పుల్లో టీడీపీ నాయకుల పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.400 కోట్లని తెలుస్తోంది.