Mrs India Andhra Pradesh: మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా సిక్కోలు మహిళ 

Srikakulam Woman as Mrs India Andhra Pradesh - Sakshi

క్లాసిక్‌ కేటగిరీలో విజేతగా నిలిచిన పైడి రజని

సాక్షి, శ్రీకాకుళం: సిక్కోలు మహిళ మెరిసింది. 2021 మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ ఫినాలేలో క్లాసిక్‌ కేటగిరీలో కిరీటం అందుకుంది. జిల్లాకు చెందిన పైడి రజని ఈ ఘనతను సాధించారు. మిసెస్‌ డైనమిక్‌ టైటిల్, కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టైటిల్, క్రౌన్‌ విజేతగా మొత్తం మూడు టైటిళ్లను గెలుచుకున్న ఏకైక మహిళగా ఆమె సత్తా చాటారు. ఈ పోటీల్లో 100 మంది మహిళలు పాల్గొనగా, 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే.. సోమ వారం ప్రకటించిన తుది ఫలితాల్లో రజని విన్నర్‌గా ఎంపికయ్యారు.  

ఉన్నత విద్యావంతురాలు.. 
పొందూరు మండలం కనిమెట్టలో జన్మించిన పైడి రజనీ ఎంఏ, ఎంఈడీ చదివారు. కింతలి జెడ్పీ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించి న ఆమె శ్రీకాకుళం ప్రభుత్వ మహిళ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ చేసి, అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ చేశారు. ఆమె భర్త పైడి గోపాలరావు పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా చేశారు. ఆమె తల్లి బొడ్డేపల్లి ఉమాదే వి దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఆమె తండ్రి పేడాడ మల్లేశ్వరరావు ఇరిగేషన్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. రెండు పీజీలు చేసిన రజని ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ విభాగంలో పరిశోధన(పీహెచ్‌డీ) చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళంలో పార్ట్‌టైమ్‌ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.  

లెక్చరర్‌గా పని చేస్తూ.. 
శ్రీకాకుళం బ్యాంకర్స్‌ కాలనీలోని చినబొందిలీపురంలో ఉంటున్న పైడి రజని.. ఒకవైపు లెక్చరర్‌గా పనిచేస్తూ మరోవైపు శక్తి అనే సంస్థను స్థాపించి మహిళల ఆర్థిక, సాంఘిక, విద్య, వ్యక్తిత్వ వికాసం, కళల్లో నైపుణ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గతంలో జేసీఐ ఇంటర్నేషనల్‌ సంస్థ ఫెమీనా అధ్యక్షురాలిగా ఎన్నో అవార్డులు సాధించారు. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కు, పేద విద్యార్థులకు, క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తున్న ఆమె వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు వస్తువులు సమకూర్చారు. కోవిడ్‌ స మయంలోనూ సేవలు కొనసాగించారు. సంప్రదాయ నృత్యంపై మక్కువతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో కోవిడ్‌ మూలంగా వర్చువల్‌ విధానంలో నిర్వహించిన 2021 మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ పోటీల్లో పాల్గొన్నారు. సింగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నైకు చెందిన వారు న్యాయ నిర్ణేతలుగా ఉన్న ఈ పోటీల్లో ఆమె ఓ కేటగిరీలో విజేతగా నిలవడం జిల్లాకే గర్వకారణం. ఒకవైపు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. విజేతగా నిలిచిన పైడి రజనీని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top