ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా.. | Srikakulam Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..

Aug 16 2025 9:46 AM | Updated on Aug 16 2025 10:02 AM

 Srikakulam Wife And Husband Incident

ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య 

 వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు 

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్‌ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్‌కుమార్‌ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.

పక్కా పథకం ప్రకారం..
మౌనిక, ఉదయ్‌కుమార్‌ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్‌ నంబరుతో అమ్మాయిలా చాటింగ్‌ చేసి ఉదయ్‌కుమార్‌ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్‌కుమార్‌ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్‌ అలియాస్‌ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్‌కుమార్‌ పర్లాకిమిడిలో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. 

మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్‌కుమార్‌, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్‌కుమార్‌ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్‌, చెప్పులు, మద్యం బాటిల్‌ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్‌కుమార్‌, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్‌ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్‌రావు, పరమేష్‌లను అభినందించి, రివార్డులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement