కార్పొరేట్‌ ఆస్పత్రికి దీటుగా సర్కార్‌ దావఖానా..

Srikakuilam District Hospital With Best Medical Facilities - Sakshi

కార్పొరేట్‌ ఆస్పత్రికి దీటుగా బుడితి సీహెచ్‌సీ

అధునాతన పరికరాల ఏర్పాటు 

నిరంతరం పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

సర్కారు దవాఖానా వాహ్‌ అనిపిస్తోంది. కార్పొరేట్‌ ఆస్పత్రికి దీటుగా పరికరాలు సమ కూర్చుకుంటోంది. విధులు, నిధులు రెండూ బాగుండడంతో ఆస్పత్రి బాగు పడుతోంది. ప్రభుత్వం కావాల్సినంత సహకారం అందిస్తుండడంతో ఒక్కొక్కటిగా పరికరాలను తన అమ్ములపొదిలో చేర్చుకుంటోంది. అధునాతన యంత్రాలతో బుడితి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.      

సారవకోట: మండలంలోని బుడితి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కార్పొరేట్‌ ఆస్పత్రికి దీటుగా మారుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. గతంలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేలా ఫైర్‌ సేఫ్టీ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఏడుగురు పారిశు ద్ధ్య కార్మికులను 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరు ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వార్డులు, ఓపీ సెంటర్, వైద్యుల గదులన్నింటినీ నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు.  
నాలుగు నెలల క్రితం దంత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, దంత సమస్యలతో ఉన్న వారికి వైద్యం అందించేందుకు వీలుగా అధునాతన యంత్రాన్ని మంజూరు చేశారు.  
 ఇటీవలే నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించడంతో వైద్య సేవలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.    

ప్రసవాలపై ప్రత్యేక దృష్టి 
గైనకాలజిస్టు సృజనీకుమారి ఆస్పత్రి ప్రసవాలపై దృష్టి సారించడంతో సహజ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సారవకోట, జలుమూరు, కోటబొమ్మాళి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల నుంచి గర్భిణులు వచ్చి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కాన్పు కష్టమైన సమయంలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేయాల్సి వచ్చినప్పుడు అవసరమయ్యే మత్తు వైద్యులను సైతం నియమించారు. ఫలితంగా కరోనా సమయంలో సైతం గైనకాలజిస్టు సృజనీకుమారి ధైర్యంగా గర్భిణులకు తోడుగా ఉంటూ ప్రసవాలు చేశారు. పిల్లల వైద్యుడు బోర సాయిరాం చిన్నారుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కొత్త యంత్రాలు.. 
ఆస్పత్రికి ఫిజియోథెరపీ కోసం వచ్చే వారికి సేవలు చేసేందుకు అవసరమైన యంత్రాలను ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యంత్రాలను ఇన్‌స్టాల్‌ చేసి సంబంధిత వైద్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. 

ప్రభుత్వ కృషి అభినందనీయం.. 
ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడం, నూతన యంత్రాల మంజూరు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం. అలాగే నాడు–నేడు కార్యక్రమంతో ఆస్పత్రులను అభివృద్ధి చేసి సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం గొప్ప విషయం.       – డాక్టర్‌ సృజనీకుమారి,
సూపరింటెండెంట్, బుడితి సీహెచ్‌సీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top