సంక్రాంతి నాటికి అన్ని నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్స్‌

Skill hubs in all constituencies by Sankranti Festival - Sakshi

176 స్కిల్‌ హబ్స్‌ ద్వారా 222 కోర్సుల్లో శిక్షణ

ఏటా 10 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం

నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి బుగ్గన  

సాక్షి, అమరావతి: సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక స్కిల్‌ హబ్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. ఇప్పటికే 66 స్కిల్‌ హబ్స్‌ ప్రారంభించామని, త్వరలోనే మరో 110 ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో నైపుణ్యాభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన 222 కోర్సులను ఎంపిక చేశామని, ప్రతి స్కిల్‌ హబ్‌లో కనీసం రెండు కోర్సుల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. మొత్తం స్కిల్‌ హబ్స్‌ అందుబాటులోకి వస్తే ఏటా 10 వేలమంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుతం 66 స్కిల్‌ హబ్స్‌లో 2,400 మందికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

శిక్షణ కేంద్రాల్లో యువతకు ఆహారం, పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజీపడొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ, నైపుణ్య, శిక్షణ శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్, సాంకేతిక విద్య డైరెక్టర్‌ నాగరాణి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఎస్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top