AgriGold: బాధితులకు బాసట

Second phase of compensation for Agrigold depositors today - Sakshi

 నేడు అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులకు రెండో దశ పరిహారం 

అమరావతి: ఓ ప్రైవేట్‌ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించి బాధితులను ఆదుకోవడం అన్నది ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదు. కానీ ప్రజా సంక్షేమంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముందుకొచ్చారు. పాదయాత్రలో, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ బాధిత డిపాజిట్‌దారులకు రెండో దశ నష్టపరిహారాన్ని సీఎం జగన్‌ మంగళవారం అందించనున్నారు. రెండో దశ కింద 7,00,370 మంది డిపాజిట్‌దారులకు మొత్తం రూ.666,85,47,256 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. చదవండి: బాధితురాలికి అండగా ప్రభుత్వం

తొలిదశలో రూ.238.73 కోట్లు పంపిణీ 
తమ కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసి మోసపోయిన డిపాజిట్‌దారులను ఆదుకుంటానని పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం అయిన తరువాత అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ఉపక్రమించారు. మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేశారు. అర్హులైనప్పటికీ ఏ కారణంతోనైనా సరే మొదటి దశలో పరిహారం పొందనివారికి మరో అవకాశం కల్పిస్తూ రెండో దశలో పంపిణీ చేయాలని నిర్ణయించారు.

టీడీపీ సర్కారు నిర్వాకం ఇదీ...
అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల టీడీపీ అధికారంలో ఉండగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల వరకూ డిపాజిట్‌ చేసిన బాధితులు కేవలం 8.79 లక్షల మందే ఉన్నట్లు నిర్ధారించి వారికి రూ.785 కోట్లు చెల్లించాలని తేల్చింది. అయితే ఎవరికీ ఒక్క రూపాయి కూడా పరిహారం ఇచ్చి ఆదుకోలేదు. బాధితులైన వేల మంది కూలీలు, చిన్న వృత్తులవారు, తోపుడు బండ్లు, రిక్షా కార్మికులు తదితరులను గాలికి వదిలేసింది.

రెండో దశలో రూ.666.85 కోట్లు పంపిణీ
ఒక డిపాజిట్‌దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా ఒక డిపాజిట్‌కు మాత్రమే చెల్లింపులు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగానే ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పారదర్శకంగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులను గుర్తించి సీఐడీ విభాగం ద్వారా నిర్ధారించింది. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసి గతంలో వివిధ కారణాలతో నష్టపరిహారం పొందలేకపోయిన 3.86 లక్షల మందిని గుర్తించి వారు డిపాజిట్‌ చేసిన రూ.207,61,52,904 పంపిణీ చేయాలని నిర్ణయించింది.చదవండి: 'అగ్రిగోల్డ్‌' అసలు దొంగ చంద్రబాబే

ఇక రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి పైగా బాధితులకు రూ.459,23,94,352 పంపిణీ చేయనుంది. ఇలా మొత్తం 7,00,370 మంది డిపాజిట్‌దారులకు రూ.666,85,47,256 చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం బటన్‌ నొక్కడం ద్వారా అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేస్తారు. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అవుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top