ఏపీ పంచాయతీ ఎన్నికలు; మూడో విడత ఏకగ్రీవాల జోరు

SEC statement that Sarpanch positions were unanimous in 579 places - Sakshi

579 చోట్ల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎస్‌ఈసీ ప్రకటన

11,739 వార్డులూ ఏకగ్రీవం

2,640 సర్పంచ్‌ స్థానాలకు 17న పోలింగ్‌.. అదే రోజు కౌంటింగ్‌

సాక్షి, అమరావతి: మూడో విడత ఎన్నికలలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. 579 చోట్ల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడో విడత 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 13 జిల్లాల నుంచి సమాచారం అందాక, ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం శనివారం అధికారికంగా విడుదల చేసింది.

579 సర్పంచ్‌ పదవులకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మూడో విడత 2,640 సర్పంచ్‌ స్థానాలకు (రెండు స్థానాల్లో నామినేషన్‌ దాఖలు కాలేదు) ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం పేర్కొంది. 7,756 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఈ నెల 17వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని తెలిపింది.

కాగా, మూడో విడతలో ఎన్నికలు జరిగే 3,221 గ్రామ పంచాయతీల పరిధిలో 31,516 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 11,732 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 19,607 వార్డులలో 43,282 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపింది. కాగా, 177 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 

నాలుగో విడత సర్పంచ్‌ పదవులకు 20,156 నామినేషన్లు
నాలుగో విడతలో 3,228 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ పదవులకు 20,156 నామి నేషన్లు, వార్డు పదవులకు 88,285 నామి నేషన్లు దాఖలు అయ్యాయి. ఈ గ్రామ పంచా యతీల్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top