గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం

SEB Commissioner Vineet Brijlal Comments On Cannabis Prevention - Sakshi

ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌  

190 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం 

పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో పాటు ఎస్‌ఈబీ విశాఖపట్నం జాయింట్‌ డైరెక్టర్‌ సతీష్‌కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్‌ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు.

ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్‌ పరిశీలించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి  నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్‌ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్‌ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

120 కిలోల గంజాయి పట్టివేత 
ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్‌ చేస్తున్న ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్‌చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top