
నిజాయితీ కలిగిన అధికారులకు బాబు కూటమి పొగ
రాష్ట్ర సర్విసులను వీడుతున్న సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్
రెడ్‌బుక్ కుట్రలకు ఎదురుతిరిగిన అధికారిగా సంచలనం
కాకినాడ రేషన్ బియ్యంపై తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దలు
ససేమిరా అన్న వినీత్.. ఒత్తిడి పెరగడంతో రాజీనామాకు సిద్ధం
చివరకు కేంద్ర సర్విసులకు వెళ్లిపోతున్న సిన్సియర్ ఆఫీసర్
ఆయన బాటలోనే మరికొందరు ఐపీఎస్‌లు!
సాక్షి, అమరావతి: ‘రెడ్‌బుక్’ అరాచకాలు, కుట్రలకు అంగీకరించకుండా.. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగబెట్టి, రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తోంది. ఇదే కోవలో చంద్రబాబు ప్రభుత్వ ‘రెడ్‌బుక్’ అరాచకాలకు ఎదురుతిరిగి సంచలనం సృష్టించిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌కూ పొగ పెట్టేసింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలని ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఇక్కడ పనిచేయలేక రాష్ట్ర సర్విసులను వీడుతున్నారు. డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఆయన డెప్యుటేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయన సీఆర్‌పీఎఫ్ ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. వినీత్ ఐదేళ్లపాటు కేంద్ర సర్విసుల్లో కొనసాగుతారు.
నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వినీత్ బ్రిజ్‌లాల్ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించేందుకు ససేమిరా అనడం పోలీసు శాఖలో పెద్ద సంచలనమే సృష్టించింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారనే అభియోగాలతో నమోదైన కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్‌గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. కానీ, దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్టుగా వైఎస్సార్‌సీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అందుకు బ్రిజ్‌లాల్ అంగీకరించలేదు.
అయినా తాము చెప్పినట్లుగానే నివేదిక ఇవ్వాలని వారంతా పట్టుబట్టడంతో బ్రిజ్‌లాల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. దాంతో బెంబేలెత్తిన డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయన్ని బుజ్జగించి, అతి కష్టం మీద ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేశారు. కానీ, సిట్ చీఫ్‌గా కొనసాగేందుకు సమ్మతించకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సిట్ వ్యవహారాలను పర్యవేక్షించలేదు. ఆయన్ని సిట్ చీఫ్ పోస్టు నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని గుర్తించిన బ్రిజ్‌లాల్ డెప్యుటేషన్‌పై కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని సీఆర్‌పీఎఫ్ ఐజీగా నియమించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. బ్రిజ్‌లాల్‌తో ఇక రెడ్‌బుక్ అరాచకాలకు ఇబ్బంది ఉండదని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయన డెప్యుటేషన్‌కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆపరేషన్ పరివర్తన్‌లో కీలక పాత్ర
ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంలో వినీత్ బ్రిజ్‌లాల్ కీలక పాత్ర పోషించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్‌గా ఆయన ఆధునిక సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటూ రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేశారు. 11 వేలకు పైగా ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. 2.50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా గిరిజనులను ప్రోత్సహించారు.
అంతటి సమర్థ అధికారిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు సహకరించలేదనే అక్కసుతో పొగబెట్టి మరీ పంపించేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన అక్రమ మార్గాల్లో పనిచేయలేక ఇప్పటికే పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో పలువురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.