ముందు చేరండి.. తరువాత చూద్దాం.. | Seats in second phase counseling without permission | Sakshi
Sakshi News home page

ముందు చేరండి.. తరువాత చూద్దాం..

Aug 6 2025 6:01 AM | Updated on Aug 6 2025 6:01 AM

Seats in second phase counseling without permission

ఇంజినీరింగ్‌ విద్యలో నిబంధనలు మిథ్య  

ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు లేరు.. అనుమతి లేదు  

అయినా.. తొలిదశలో 91 సీట్ల భర్తీ  

శ్రీకాళహస్తి ఇంజినీరింగ్‌ కాలేజీ.. జేఎన్‌టీయూ అనంతపురంలో విలీనం  

నిబంధనలు పట్టించుకోకుండా హడావుడి నిర్ణయం  

అనుమతి లేకుండానే రెండోదశ కౌన్సెలింగ్‌లో సీట్లు  

సాక్షి, అమరావతి: ‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి..’ అన్నట్లుంది ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ముందు సీట్లు భర్తీచేస్తే తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చన్నట్లు వ్యవహరిస్తోంది. నిబంధనలకు పాతరేస్తూ కౌన్సెలింగ్‌ను చేపట్టడంతో పదేపదే అభాసుపాలవుతున్న ప్రభుత్వం.. పద్ధతి మాత్రం మార్చుకోవడంలేదు. విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతోంది. కీలక అంశాలపై నిర్ణయాలను కేవలం నోటి మాటతోనే అమలు చేస్తోంది. 

ప్రధానంగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో, శ్రీకాళహస్తి ఇంజినీరింగ్‌ కళాశాలలోను ఇంజినీరింగ్‌ సీట్లను నిబంధనలు పాటించకుండానే భర్తీ చేస్తుండటం చూస్తే ఇంజినీరింగ్‌ విద్యపై సర్కారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు అనుమతుల్లేకపోయినా సీట్లు భర్తీచేస్తోంది. శ్రీకాళహస్తి ఇంజినీరింగ్‌ కళాశాలను నిబంధనలు పాటించకుండానే జేఎన్‌టీయూ అనంతపురంలో విలీనం చేసినట్లు ప్రకటించి సీట్లను కౌన్సెలింగ్‌కు ఉంచింది.   

కాలేజీకి అనుమతే లేదు  
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం దయనీయంగా మారింది. సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండటంతో ఇటీవల దశాబ్దాల నాటి శ్రీనివాసం వనంలోని భారీ వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంది. ఇందులో అక్రమాలు, అవినీతిపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి వర్సిటీ ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరింది. 

ఇందుకోసం సమర్పించిన ఫీజుబులిటీ రిపోర్టు సక్రమంగా లేకపోవడంతో అనుమతి లభించలేదు. అయినా వర్సిటీ అధికారులు సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల పేరుతో కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌ఈ), కంప్యూటర్‌ సైన్స్‌–ఏఐఎంఎల్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్టు సర్క్యులర్‌ ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. సీఎం నియోజకవర్గంలోని వర్సిటీ కావడంతో ఉన్నతాధికారులు నోటిమాట ద్వారా ఈఏపీసెట్‌ తొలిదశ కౌన్సెలింగ్‌లో కళాశాలను పెట్టారు. 

రెండు బ్రాంచ్‌లలో కలిపి 130 సీట్లు ఉంటే సీఎస్‌ఈలో 63, సీఎస్‌ఈ–ఏఐఎంఎల్‌లో 28.. మొత్తం 91 సీట్లను భర్తీచేశారు. ఇప్పుడు వీరికి వర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న ఆరుగురు ప్రొఫెసర్లతోనే పాఠాలు చెప్పించాలని చూస్తున్నారు. వీరిలో ఒకరు మాత్రమే బీటెక్, ఎంటెక్‌ చేసినవారు. మిగిలినవారిది ఎంసీఏ బ్యాక్‌గ్రౌండ్‌. వీరు ఎంసీఏతో పాటు ఎమ్మెస్సీ విద్యార్థులకు కూడా పాఠాలు చెబుతున్నారు. ఇప్పటికే పనిభారం ఎక్కువైందని వీరు ఇంజినీరింగ్‌ బోధనకు విముఖత చూపుతున్నారు.   

ఏ ప్రాతిపదికన విలీనమో.. 
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నడి­చే ఇంజనీరింగ్‌ కళాశాల ప్రవేశాలు లేకపోవడంతో గతంలో మూతపడింది. తాజాగా దాన్ని  కూటమి ప్రభుత్వం జేఎన్‌టీయూ అనంతపురంలో విలీనం చేసినట్టు ప్రకటించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధన­లు పా­టించారనేది ఎవరికీ తెలియడంలేదు. కళాశాలను టేకోవర్‌ చేసుకున్నట్టు జీవో లేదు. కళాశాల ఆస్తులు, బోధన, బోధనేతర ఉద్యోగులను వర్సిటీకి అప్పగించడానికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇన్‌టేక్‌ ఉత్తర్వు­లు లేకుండానే ఈఏపీసెట్‌ రెండోదశ కౌన్సెలింగ్‌లో జేఎన్‌టీయూఏ–శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పేరుతో ఐదుకోర్సుల్లో 60 సీట్ల చొప్పున భర్తీకి చేర్చారు. 

కోర్‌ కోర్సులను వదిలేసి..  
సాంకేతిక విద్యలో కోర్‌ కోర్సులను ప్రభుత్వం నిర్ల­క్ష్యం చేస్తోంది. కేవలం కంప్యూటర్‌ ఆధారిత కోర్సులకే ప్రచారం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. కంప్యూటర్‌ ఆధారిత కోర్సులతో పాటు కచ్చితంగా సివిల్, మెకానికల్‌ వంటి కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు అందించాలని ఏఐసీటీఈ నిబంధనలు చెబుతున్నాయి. 

వీటిని కచ్చితంగా అమలు చేయా­ల­ని ప్రభుత్వం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజ­మాన్యాలను హెచ్చరిస్తోంది. కానీ తమ వర్సిటీల్లో మాత్రం అమలు చేయడంలేదు. ద్రావిడ విశ్వవిద్యా­లయంలో సీఎస్‌ఈ, సీఎస్‌ఈ–ఏఐఎంఎల్, శ్రీకా­ళహస్తి కళాశాలలో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌డీ, సీఎస్‌ఈ–ఏఐఎంల్‌ కోర్సులను మాత్రమే అంది­స్తోంది. పైగా ప్రైవేటు విద్యాసంస్థలతో పోలిస్తే వీ­టిల్లో ఫీజు కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement