సంక్రాంతి వెనుక సైన్స్‌ | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వెనుక సైన్స్‌

Published Sun, Jan 14 2024 3:58 AM

The Science Behind Sankranti - Sakshi

సాక్షి, అమరావతి: సూర్యుడు జ్ఞానానికి.. జీవిత శ్రేయస్సుకు ప్రతీక. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం.. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి మారతాడు. సూర్యుని ఖగోళ ప్రయాణంతో ముడిపడి ఉన్న మకర సంక్రాంతితో శీతా­కాలం ముగుస్తుంది. ఎండ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుని పథం మారుతున్న రుతువులపై ప్రభా­వం చూపిస్తుంది. ఈ కాలం సాంస్కృతిక, వ్యవసాయ ప్రాముఖ్యతకు ప్రతీక.

శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. మకర సంక్రాంతి నాడు కీలకమైన మార్పు వస్తుంది. సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖను దాటి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. వసంత కాలం మొదలవుతుంది. సూర్యుడు హారిజోన్‌పైన ఎక్కువ సమయం గడపడం వల్ల పగటి వేళలు క్రమంగా పెరుగుతాయి. పెరిగిన సూర్యరశ్మి భూమిని వేడెక్కిస్తుంది. మంచు తగ్గుతుంది. ఫలితంగా పంటలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వస్తాయి. 

పండుగ చుట్టూ ఎన్నో నమ్మకాలు 
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కీడు ఉందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొడుకులున్న తల్లులు పరిహారం చేయాలని, ముఖ్యంగా ఒక్కడే కొడుకు ఉన్నవారు గాజులు వేసుకోవాలని కొత్త ఆచారం పుట్టుకొచ్చింది. ఒకే అల్లుడు ఉన్న అత్త, అల్లుడిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు, తులం బంగారం పెట్టాలని.. కొత్త అల్లుడైతే కాళ్లను పాలతో కడగాలంటూ వింత నియమం చక్కర్లు కొడుతోంది. అయితే.. ఎవరి గాజులు వారే కొనుక్కుని వేసుకోకూడదు.

వేరే వాళ్ల నుంచి తీసుకోవాలి. దీనిని నమ్మి గ్రామాల్లో ఎక్కువగా మహిళలు ఒకరికొకరు గాజులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా లేదా అని అన్వేషిస్తే.. ఈ సంక్రాంతి కీడు వెనుక సైన్స్‌ ఉందని తేలింది. అల్లుళ్లకు కాళ్లు కడగడం, కానుకలివ్వడం అనేది కేవలం పుకారు మాత్రమేనని పండితులు కొట్టిపడేశారు. కానీ గాజులు ధరించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు.  

దేవతల చేతులకూ గాజులు 
ఆలయాల్లో దేవతా శిల్పాల ముంజేతికి ఆభరణాలు ఉంటాయి. వాస్తవానికి ముంజేతి మణికట్టు భాగంలో వినాళ వ్యవస్థకు అనుసంధానం చేసే నాడులు ఉంటాయి. ఈ భాగంలో చిన్నగా ఒత్తిడి కలిగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు బాగుంటుందని సైన్స్‌ చెబుతోంది. ఇలా మనం ధరించే ఆభరణాల వెనుక ఇలాంటి శాస్త్రీయ కోణం ఉంది.

శాస్త్రంతో నిండిన పండుగ రోజులు 
ప్రతికూలతలను దహనం చేయడానికి ప్రతీకగా వేసే భోగి మంటలు సూర్యుని వెచ్చదనాన్ని స్వాగతిస్తాయి. ఈ మంటల్లో మట్టి పాత్ర వేసి వండే పాయసంలో అనేక పోషకాలుంటాయి. నువ్వులు, బెల్లం వంటి నైవేద్యాలు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఎగురుతున్న గాలిపటాలు సూర్యు­ని ఆరోహణను అనుకరిస్తాయి. సాంస్కృతిక వేడుకలతో నూతనోత్సాహం వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత గూటికి చేరడంతో సంతోషం వెల్లివిరుస్తుంది.

Advertisement
 
Advertisement