
వరదయ్యపాళెం: తిరుపతి జిల్లాలో ఆదివారం సత్యవేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత కారు ఢీకొని ఒక యువకుడు గాయపడ్డాడు. అతడిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు వరదయ్యపాళెం సమీపంలోని వడ్డిపాళేనికి చెందిన బేల్దారి మేస్త్రి సురేష్ కథనం మేరకు.. అతడు ద్విచక్ర వాహనంపై వెళుతూ తడ–శ్రీకాళహస్తి ప్రధాన రోడ్డులోకి ప్రవేశించే సమయంలో వరదయ్యపాళెం నుంచి సత్యవేడు వైపు వెళ్తున్న సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది.
సురేష్ చేతికి, తలకి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే హేమలత వరదయ్యపాళెంలోని ఓ టీడీపీ నేత ఇంటికి వెళ్లారు. గాయపడిన సురేష్‌ను కుటుంబసభ్యులు, స్థానికులు వరదయ్యపాళెంలో ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి తరలించారు. బాధితుడికి రూ.3 వేలు ఇచ్చిన టీడీపీ నేతలు ప్రమాదం గురించి గోప్యంగా ఉంచారు. బేలుదారు మేస్త్రిగా రోజూ పనికివెళ్తేగానీ పూటగడవని తమకు దిక్కెవరంటూ బాధితుడు, అతడి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.