భక్తుల సత్యసాయి నామ స్మరణతో ఆధ్యాత్మిక నగరి పుట్టపర్తి పులకించింది.
కనుల పండువగా.. సత్యసాయి రథోత్సవం
సాయినామంతో పులకించిన ఆధ్యాత్మిక నగరి
సత్యసాయి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
వేడుకను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మేడలెక్కి.. ‘సాయి’భక్తి.. భిన్నంగా రథోత్సవం..
వేడులకు ప్రముఖుల హాజరు మురిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు
భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. వేడుకల్లో భాగంగా మంగళవారం సత్యసాయి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రశాంతి నిలయం: సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మంగళవారం పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించింది. ఉదయం ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మూలవిరాట్ సత్యసాయి విగ్రహానికి పూజా క్రతువులు నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో వేదపండితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేణుగోపాల స్వామి, సీతారామలక్ష్మణ సమేత హనుమ విగ్రహాలకు ప్రత్యేకపూజలు చేశారు. తర్వాత సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. సత్యసాయి సన్నిధిలోనే నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు.
వేద మంత్రాల నడుమ సత్యనారాయణ వ్రత క్రతువులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మూలవిరాట్ సత్యసాయి విగ్రహాన్ని, ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామి, రామలక్ష్మణ సమేత హనుమ పల్లకీలను సాయికుల్వంత్ సభా మందిరం ఉత్తరగోపురం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పెద్దవెంకమరాజు కల్యాణ మండపం వద్ద సత్యసాయి రథానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి భక్తులు ఉత్తర గోపురం వద్దకు రథాన్ని తీసుకువచ్చి సత్యసాయి వెండి రథంలోకి మూలవిరాట్ సత్యసాయి విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బృందం, పలువురు రాష్ట్ర మంత్రులతో కలసి ప్రారంభించారు. అశేష భక్తుల నడుమ పురవీధుల్లో సత్యసాయి రథోత్సవం సాగింది. పెద వెంకమరాజు కల్యాణ మండపం వద్ద రత్నాకర్ రాజు దంపతులు మంగళహారతితో రథోత్సవాన్ని ముగించారు.
భిన్నంగా రథోత్సవం..
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆనవాయితీకి భిన్నంగా బాబా శతజయంతి వేడుకల్లో వేణుగోపాలస్వామి రథోత్సవ స్థానంలో సత్యసాయి రథోత్సవం నిర్వహించింది. తమ ఇలవేల్పు సత్యసాయి రథోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద తరలివచ్చారు. ‘సాయిరాం’ నామస్మరణతో పరవశించిపోయారు. పుట్టపర్తి పురవీధులన్నీ సాయి నామస్మరణతో ప్రతిధ్వనించాయి. ఉత్సవమూర్తుల పల్లకీలు ముందు ఊరేగగా.. ఆ వెనకే మూలవిరాట్ సత్యసాయి రథం ముందుకు సాగింది. భక్తులు సత్యసాయి రథాన్ని ముందుకు లాగుతూ తరించారు. అడుగడుగునా రథానికి హారతులు పడుతూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు.
మేడలెక్కి.. ‘సాయి’భక్తి..
పుట్టపర్తి పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చారు. చరిత్రలో తొలిసారిగా పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవం నిర్వహించారు. ఎలాగైనా తన ఇష్టదైవం సత్యసాయి రథోత్సవాన్ని కనులారా తిలకించాలన్న ఆకాంక్షతో భక్తులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవంతులపైకి ఎక్కారు. సత్యసాయిపై భక్తిభావనను చాటుతూ రథంపైకి పూలు విసిరారు.
మురిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు
సత్యసాయి రథోత్సవంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మురిపించాయి. సత్యసాయి బాలవికాస్ చిన్నారులు రథోత్సవంలో రామలక్ష్మణ సమేత హనుమ దేవతామూర్తుల వేషధారణతో నృత్య ప్రరద్శన నిర్వహించారు. పుట్టపర్తి పరిసర గ్రామాల కళాకారులు కోలాటం, చెక్కభజన, హరిదాసుల వేషాలతో అలరించారు. వివిధ ప్రాంతాల కళాకారుల గిరగ నృత్యం, నెమలి నాట్యం, డప్పువాయిద్యాలు, గొరవయ్యల వేషధారణతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
వేడులకు ప్రముఖుల హాజరు
సత్యసాయి రథోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని రథాన్ని లాగారు. వీరిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, చక్రవర్తి, నాగానంద, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


