ఆర్టీసీలో ‘కారుణ్యం’

RTC unions are happy about the Chief Minister's decision - Sakshi

2016 – 2019 మధ్య మృతి చెందిన సిబ్బంది వారసులకు ఊరట

1,168 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం జగన్‌ ఆమోదం

ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల హర్షం 

మనసున్న పాలకుడి పనితీరు ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. 2016–19 మధ్య కాలంలో మరణించిన 1,168 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  – సాక్షి, అమరావతి/కదిరి 

నాడు  చంద్రబాబు ససేమిరా...
టీడీపీ అధికారంలో ఉండగా 2016 – 19 మధ్య 1,168 మంది ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందగా కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఆర్టీసీ నాడు కార్పొరేషన్‌గానే ఉన్నప్పటికీ కనికరించలేదు. కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. 

నేడు   మానవత్వంతో..
కారుణ్య నియామకాల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవీయ దృక్పథంతో వ్యవహరించారు. విలీనంతో ఆర్టీసీ ప్రభుత్వ విభాగంగా మారిన తరువాత కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సమ్మతించడం గమనార్హం. 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు అర్హతలను బట్టి 34 మందికి జూనియర్‌ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మంది డ్రైవర్లుగా, 445 మందికి శ్రామిక్‌/ అసిస్టెంట్‌ మెకానిక్‌లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగ సంఘాల హర్షం
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు ఆమోదం తెలపడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. వివిధ కేటగిరీల్లో 1,168మందికి ఉద్యోగాలు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై ధన్యవాదాలు తెలియజేశాయి.

ఆర్టీసీ ఉద్యోగులపట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందనేందుకు ఇది నిదర్శనమంటూ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు  కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top