ప్రమాదాలకు చెక్‌.. వాటేన్‌ ఐడియా.. డ్రైవర్‌ రాజా..!

RTC Bus Driver Idea For Accident Prevention Konaseema District - Sakshi

కొత్తపేట/రావులపాలెం(కోనసీమ జిల్లా): ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్‌ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదాలను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్‌ బాల్‌ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
చదవండి: ప్రేమ పేరుతో ఎస్‌ఐ వంచన

రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్‌ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తూంటారు.

దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని సత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారు.

ఆ క్రమంలోనే ఆయనకు స్టీల్‌ బాల్‌ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్‌ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్‌ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్‌ బాల్‌లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్‌ డోర్‌ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలకు చెక్‌ పడింది. ఈ స్టీల్‌ బాల్‌ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్‌ బాల్‌ తయారీకి కేవలం రూ.100 ఖర్చయినట్టు సత్యనారాయణరాజు తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికారులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top