ప్రతిభావంత క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం 

RK Roja Says Andhra Pradesh Govt encourage talented athletes - Sakshi

మంత్రి ఆర్కే రోజా 

జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌ యాప్‌ ఆవిష్కరణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె సచివాలయంలో శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్, శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులకు పలు ప్రయోజనాలను చేకూర్చే జగనన్న స్పోర్ట్స్‌ యాప్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగనన్న స్పోర్ట్స్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ప్రతి గ్రామంలోను జగనన్న స్పోర్ట్స్‌ క్లబ్‌ల ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, జగనన్న స్పోర్ట్స్‌ యాప్‌ను క్రీడాకారులు ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్‌ పాలసీ సవరణలపై ఈ సందర్భంగా సమీక్షించారు.

జగనన్న స్పోర్ట్స్‌ యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని స్పోర్ట్స్‌ క్లబ్బులు, క్రీడాకారుల సమాచారం పొందుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులు ఈ యాప్‌లో తమ క్రీడకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం ద్వారా క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు.  

అన్న క్యాంటీన్ల పేరుతో ఘర్షణలకు టీడీపీ కుట్ర   
అనవసర విషయాలను అడ్డంపెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె తాడేపల్లిలో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించలేదని ప్రశ్నించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top