అస్మదీయ ఆస్పత్రులకే నిధులు! | Refusal of treatments for Aarogyasri procedures | Sakshi
Sakshi News home page

అస్మదీయ ఆస్పత్రులకే నిధులు!

Apr 11 2026 3:43 AM | Updated on Apr 11 2026 3:43 AM

Refusal of treatments for Aarogyasri procedures

ఆరోగ్యశ్రీ ప్రొసీజర్‌లకు చికిత్సల నిరాకరణ 

ఎల్‌ఓసీల కింద పెద్ద మొత్తంలో నిధుల లూటీ 

‘ముఖ్య’నేత బంధువు ఆస్పత్రిది ఇదే తీరు 

‘సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా’ కథనంపై సర్కారు దాటవేత  

సాక్షి, అమరావతి: ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కారు.. కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులకు చెందిన ఆస్పత్రులకు మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) రూపంలో నిధుల  వరద పారిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సలతో పాటు రెండు చెవులకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ లాంటి ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్‌ఓసీల రూపంలో రెండు మూడు రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్యశ్రీలో నిరాకరణ
క్యాన్సర్‌ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్‌ థెరపీకి ఆరోగ్యశ్రీలో రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా ఇస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆస్పత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలను నిరాకరిస్తూ ఎల్‌ఓసీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. 

ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ‘ముఖ్య’నేత బంధువుకు చెందిన క్యాన్సర్‌ ఆస్పత్రిలో బోన్‌మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు చెందిన ఆస్పత్రులు ఎల్‌ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘స్వాహా’పై దాటవేత..!
‘సాక్షి’ గురువారం సంచికలో ప్రచురించిన ‘సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా!’ కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే సీఎంఆర్‌ఎఫ్‌ సాయం మంజూరు, ఎల్‌ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపింది. అయితే వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్లయ్యకు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్‌ రూ.8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement