RBI Report: అలర్ట్‌.. నకిలీ నోట్లపై ఆర్‌బీఐ కీలక రిపోర్ట్‌

RBI report on fake notes - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు కంటే.. రూ.500 నోట్లే అత్యధికంగా నకిలీవి చలామణి అవుతున్నాయని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. రూ.200 నోట్ల కంటే కూడా రూ.100 నకిలీ నోట్లే ఎక్కువ మార్కెట్‌లోకి ప్రవేశించాయని తెలిపింది. ఆర్‌బీఐ తాజాగా ఉపసంహరించిన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి.

2022–23లో దేశంలో నకిలీ నోట్లపై ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గుర్తించే నకిలీ నోట్లపై ఆర్‌బీఐ ఏటా నివేదిక విడుదల చేస్తుంది. జాతీయ బ్యాంకులు, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము గుర్తించిన నకిలీ నోట్లను ఆర్‌బీఐకి పంపిస్తాయి. ఆ విధంగా గుర్తించిన నోట్ల గణాంకాలను ఆర్‌బీఐ ఏటా విడుదల చేస్తుంది.  

నోట్ల ముద్రణకు రూ.4,682.80 కోట్లు 
ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2022–23లో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం (సెక్యూరిటీ ప్రింటింగ్‌) ఆర్‌బీఐ రూ.4,682.80కోట్లు వెచ్చించింది. 
♦ దేశవ్యాప్తంగా 2022–23లో మొత్తం 2,25,769 నకిలీ నోట్లను గుర్తించారు. వాటిలో 4.6 శాతం నోట్లను ఆర్‌బీఐ నేరుగా గుర్తించగా.. 95.4 శాతం నోట్లను దేశంలోని వివిధ బ్యాంకులు గుర్తించాయి.  
    2021–22తో పోలిస్తే 2022–23లో దేశంలో గుర్తించిన నకిలీ నోట్లు 5,202 తగ్గాయి. 2021–22లో దేశంలో 2,30,971 నకిలీ నోట్లను గుర్తించారు. 
    గత ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్లలో రూ.500 నోట్లు మొదటి స్థానంలో ఉన్నాయి. 91,110 నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. 2021–22 కంటే నకిలీ రూ.500 నోట్లు 14 శాతం పెరిగాయి.  
    నకిలీ నోట్లలో రూ.100 నోట్లు రెండో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 78,699 నకిలీ రూ.100 నోట్లను గుర్తించారు.  
    రూ.200 నకిలీ నోట్లు మూడో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక  సంవత్సరంలో 27,258 నకిలీ రూ.200 నోట్లను గుర్తించారు.  
   నాలుగో స్థానంలో రూ.50 నోట్లు ఉన్నాయి. 2022–23లో 17,755 నకిలీ రూ.50 నోట్లను గుర్తించారు.  
    దేశంలో ఎక్కువ విలువైన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 9,806 నకిలీ రూ.2 వేల నోట్లను గుర్తించారు.  
    గుర్తించిన మిగిలిన నకిలీ నోట్లలో రూ.2, రూ.5 నోట్లతో పాటు రూ.500, రూ.1,000 విలువ గల స్పెసిఫైడ్‌ బ్యాంక్‌ నోట్లు (2016కు ముందు చలామణిలో ఉన్న నోట్లకు నకిలీవి) ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top