కక్షగట్టి.. పొట్టకొట్టి! | Ration vehicle drivers protest at Vijayawada Chowk for second day | Sakshi
Sakshi News home page

కక్షగట్టి.. పొట్టకొట్టి!

May 30 2025 3:14 AM | Updated on May 30 2025 3:14 AM

Ration vehicle drivers protest at Vijayawada Chowk for second day

బడుగు, బలహీన వర్గాల మీదే సీఎం చంద్రబాబు ప్రతాపం

పేదల ఇంటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా?

9,260 ఎండీయూల్లో 288 కేసులుంటే.. డీలర్లపై 6 వేల కేసులు లేవా?

బియ్యం పక్కదారి పడుతున్నాయని చంద్రబాబు ఈ–పొస్‌ మిషన్లు తేలేదా?

దొంగ చేతికి తాళాలిచ్చేందుకు మమ్మల్ని బలి పశువులను చేస్తారా?

కూటమి పార్టీలు వెన్నుపోటు ఏ రకంగానైనా పొడవగలరని నిరూపించారు

వలంటీర్లను నమ్మించి దెబ్బకొట్టారు.. మమ్మల్ని వంచించి ముంచేశారు

మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయండి

1వ తేదీ నుంచి రేషన్‌ దుకాణాల దగ్గర ప్రజల తిరుగుబాట్లు చూడక తప్పదు

విజయవాడ ధర్నా చౌక్‌ రెండో రోజు ధర్నాలో రేషన్‌ వాహనాల డ్రైవర్ల ధర్మాగ్రహం  

‘‘వలంటీర్లను నమ్మించి దెబ్బకొట్టినట్టే రేషన్‌ వాహనాల డ్రైవర్లను వంచించి ముంచారు. మాకు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎండీయూల రద్దును వెనక్కి తీసుకోకపోతే రేషన్‌ దుకాణాల వద్ద జూన్‌ 1న ప్రజల తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’’ – రేషన్‌ వాహనాల డ్రైవర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ 

‘‘75 శాతం ప్రజలు ఎండీయూల సేవలను కోరుకుంటున్నారు. 35 మార్కులు వస్తే పరీక్షల్లో పాస్‌. అలాంటిది 75 శాతం అంటే డిస్టింక్షన్‌. అలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు ఫెయిల్‌ చేస్తోంది. పాఠశాలలు తెరిచేముందు రద్దు చేయడంతో పిల్లలకు ఫీజు కూడా కట్టుకోలేని దుస్థితి. మంత్రి నాదెండ్లకు అవగాహన లేదు. ఎండీయూల రద్దుపై మీకు నచ్చిచనవాళ్లతో ప్రజల దగ్గరకు వెళ్లి సర్వే చేసుకోండి. వారు తిరస్కరిస్తే మీ ఇష్టం. అన్యాయంగా మా జీవితాలను దెబ్బకొట్టొద్దు’’–కర్నూలుకు చెందిన రేషన్‌ వాహన డ్రైవర్‌ కేశవ్‌

‘‘రేషన్‌ అక్రమ రవాణాను అరికడతామనే కదా.. చంద్రబాబు గతంలో ఈ–పొస్‌ మిషన్లు తెచ్చింది. డీలర్ల ద్వారా పంపిణీ సక్రమంగా జరగట్లేదని చెప్పారు కదా? పేదల బియ్యాన్ని డీలర్లు బొక్కేస్తున్నారని 22 ఏళ్ల కిందట వ చ్చిన ఠాగూర్‌ సినిమాలో చిరంజీవి చూపించలేదా? అప్పుడేమైనా ఎండీయూ వ్యవస్థ ఉందా? వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నారా? ఇప్పుడు మాపై బురదజల్లి దొంగల చేతికి తాళాలిస్తూ మమ్మల్ని బలిపశువులను చేస్తారా’– రేషన్‌ వాహనాల డ్రైవర్ల సంఘం మండపేట మండలం సంఘం అధ్యక్షుడు కిరణ్‌  

సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని తగ్గించాలి గానీ.. ఉన్న ఉద్యోగాలు పీకేసీ ప్రజలను రోడ్డున పడేయకూడదు. ఎన్నికల ముందు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి.. గెలిచాక ఉన్న ఉద్యోగాలు తీసివేయడమేనా అభివృద్ధి? మాపై కక్షగట్టి.. పొట్ట కొట్టడమేనా సంక్షేమం..? బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లనే కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోంది. 

పేదల ఇంటికి బియ్యం చేరవేస్తే అనాగరికమా? మా జీవితాలను కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?’’ అంటూ రేషన్‌ వాహనాల (ఎండీయూ)  డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం రెండో రోజు కూడా తమ నిరసనను కొనసాగించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చి తీరాల్సిందేనని నినదించారు. 

ఈ ప్రశ్నలకు బదులేది? 
ఇవీ న్యాయమైన ప్రశ్నలు అంటూ రేషన్‌ వాహన డ్రైవర్లు ప్రభుత్వానికి  ప్రశ్నలు సంధించారు. అవేంటంటే? 
» మేము ఎప్పుడైనా జీతం పెంచాలని కోరామా?  
»   ఎండీయూ వ్యవస్థ ప్రారంభంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.70. ఇప్పుడు రూ.110. అయినా మేం పనిచేయట్లేదా? 
»  మాకు ఉచితంగా వాహనం ఇవ్వడం లేదు. మేం డిపాజిట్లు కట్టాం. ప్రతి నెల మా జీతంలో బ్యాంకులకు వాయిదాలు కడుతున్నాం. ఉచితమని ఎలా చెబుతారు? 
»  ముగ్గురు డీలర్లు చేసే పనిని ఒక్క ఎండీయూ చేస్తోంది. మాకు ఇచ్చే రూ.21 వేలల్లో చేతికి వచ్చేది రూ.18 వేలు. అందులో హెల్పర్లకు, హమాలీలకు సగం మేమే చెల్లించుకోవట్లేదా? 
» ఒక్కో డీలర్‌కు రూ.12 వేలకు పైగా కమీషన్లు ఇస్తున్నారు. అంటే ముగ్గురు డీలర్లకు సుమారు రూ.40 వే­లు. కానీ, ఒక్క ఎండీయూ చేతికి వచ్చేది రూ.18 వేలు.  
» 9,260 ఎండీయూలపై 288 కేసులు ఉన్నాయంటున్నారు. మా సంఖ్యలో ఒక్క శాతం కూడా కాదిది. మరి 28 వేలమందికిపైగా డీలర్లలో 6 వేలకుపైగా కేసులు లేవా? 
» నాయ్యంగా మా అగ్రిమెంట్‌ వరకు కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? ప్రజలను మళ్లీ రేషన్‌ దుకాణాల ఎదుట క్యూలో నిలబెడితే వచ్చేదేమిటి?

రాజకీయాలు చూస్తే నాకు బండి రాదు కదా? 
నేను టీడీపీ కార్యకర్తను. గత ప్రభుత్వంలో నాకు రాజకీయాలకు అతీతంగా మేలు జరిగింది. కారు డ్రైవర్‌గా ఆప్టింగ్‌లకు వెళ్లే నేను.. సొంత ఊరిలో రేషన్‌ వాహన డ్రైవర్‌గా మారాను. ఇద్దరు బిడ్డలను ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే ఇంజనీరింగ్‌లో చేర్పించా. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాజకీయం చూసి ఉంటే ఇవన్నీ నాకు వచ్చేవి కాదు కదా? ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నీరుగారిపోయింది. 

నేను మూడు నెలలకు ఒక్కొక్కరికి 9 వేలపైనే ఫీజులు కడుతున్నా. ఇప్పుడు ఎండీయూల రద్దుతో నా ఉపాధి కూడా పోయింది. రాజకీయ క్షక్షసాధింపులు చేస్తే చివరికి బలయ్యేది ప్రజలే. అందులో టీడీపీని నమ్మిన నాలాంటి వాళ్లు కూడా ఉంటారని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది.  –చెన్ను సత్యం, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా 

మళ్లీ కూలికి పోవాల్సిందే.. 
నాలుగేళ్లు రేషన్‌ వాహనం నడుపుకొన్నా. ప్రభుత్వం నుంచి క్రమంతప్పకుండా గౌరవ వేతనం రావడంతో దిగులు లేకుండా పోయింది. అంతకుముందు రోజూ కూలికి వెళ్తే తప్ప పొట్ట నిండేది కాదు. వర్షాకాలం, వేసవిలో పెద్దగా పనులు ఉండవు. మా చేతుల్లో డబ్బులు కూడా ఉండవు. రేషన్‌ వాహన డ్రైవర్‌గా ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతికాను. ఇప్పుడు మళ్లీ కూలి పనులు వెదుక్కొనే దుస్థితికి తీసుకొచ్చారు. 

నాకు ఇద్దరు పిల్లల స్కూల్‌ ఫీజులే రూ.70 వేలు అవుతున్నాయి. గతంలో అమ్మఒడి, వాహన మిత్ర, చేయూత, అమ్మకు పింఛన్‌ రూపంలో ప్రభుత్వ సాయం అందేది. ఎప్పుడూ మా అమ్మ నన్ను రూపాయి అడగలేదు. నాకే తిరిగి సాయం చేసేది. జీవితం హాయిగా వెళ్లిపోయేది. ఇప్పుడు అవన్నీ నిలిచిపోవడం, ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. –సుదీర్, పెదకాకాణి, గుంటూరు జిల్లా 

ఉపాధిని ఊడగొట్టారు.. 
ట్రాక్టర్‌ డ్రైవర్‌గా కౌలు వ్యవసాయం చేసేవాడిని. ఎండీయూల రాకతో రేషన్‌ వాహన డ్రైవర్‌ అయ్యాను. ప్రతి నెల కొంత సొమ్ము నిర్దిష్టంగా రావడంతో చాలా ఊరటగా ఉండేది. ఆ ధైర్యంతోనే గత ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తే.. బ్యాంకు లోన్‌ తీసుకుని జగనన్న కాలనీలో ఇళ్లు కట్టాను. ప్రతి నెలా రూ.7 వేలు వాయిదాను కడుతున్నా. నాకు ఇద్దరు పిల్లలు. గతంలో అమ్మఒడి రావడంతో ఫీజుల బాధ ఉండేది కాదు. ఇప్పుడు ఏ పథకమూ రాకపోగా ఉన్న ఉపాధిని ఊడగొట్టారు. – వై.గోపి, కొల్లిపర, గుంటూరు జిల్లా 

మళ్లీ మాకు గడ్డు కాలమే..! 
నేను డిగ్రీ చదివాను. వైఎస్‌ జగన్‌ ఎండీయూ వ్యవస్థను తీసుకురావడంతో రేషన్‌ వాహన డ్రైవర్‌గా సొంత ఊరిలో ఉపాధి దొరికింది.  భార్య ముగ్గురు పిల్లలతోపాటు, తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లిని జాగ్రత్తగా చూసుకోగలిగాను. ఇక అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వాహన మిత్ర ఇలా నిత్యం ఏదో ఒక పథకం రూపంలో ఆర్థిక సాయం అందేది. వాటితో మిర్చి, పత్తి పంటను కౌలుకు చేసేవాళ్లం. రేట్లు బాగుండి లాభం వచ్చింది. ఇప్పుడు మొత్తం నష్టాలే. ఉపాధి లేకుండా చేస్తామనడంభావ్యమా? –సీహెచ్‌ యలమంద, గురజాల, పల్నాడు జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement