మాఫియా రూటే సెపరేటు | Ration Rice Seized in Large Quantities in Kavali and Kovur | Sakshi
Sakshi News home page

మాఫియా రూటే సెపరేటు

Mar 23 2026 5:12 AM | Updated on Mar 23 2026 5:12 AM

Ration Rice Seized in Large Quantities in Kavali and Kovur

వరుసగా కావలి, కోవూరులో భారీగా పట్టుబడిన రేషన్‌ బియ్యం

కావలి కేంద్రంగా పాలిషింగ్‌ 

కేవలం దాడులకే పరిమితమవుతున్న వైనం 

మూలాల్లోకి వెళ్లని అధికారులు

ఆగని రేషన్‌ బియ్యం అక్రమ రవాణా   

కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌ బ్యాగుల్లో  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో  పేదల బియ్యం అక్రమ రవాణా జోరుగా జరిగిపోతోంది. కావలి కేంద్రంగా ఈ దందా భారీస్థాయిలో జరుగుతోంది. ఇటీవల కావలిలో అధికారుల వరుస దాడుల్లో బియ్యం పట్టుబడ్డాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీగా పేదల బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.

నెల్లూరు(పొగతోట): రేషన్‌ బియ్యం మాఫియా రోజురోజుకు కొత్త రూపు సంతరించుకుంటోంది. గత కొన్ని నెలలుగా బియ్యం మాఫియా కావలిని కేంద్రంగా మార్చుకుంది. స్థానిక నాయకుల సహకారంతో రెచ్చిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫియా లీడర్లు అధికారుల కళ్లుకప్పి బియ్యం అక్రమ రవాణాలో నూతన విధానాలు అవలంభిస్తున్నారు. గతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి వచ్చిన సంచులతోనే బియ్యం అక్రమంగా తరలించారు. 

ప్రస్తుతం అధికారులు, ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నూతన విధానాలు ప్రారంభించింది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌ బ్యాగుల్లో బియ్యం నింపి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో రాత్రి సమయంలో లారీల ద్వారా బియ్యం అక్రమంగా తరలించే వారు. ప్రస్తుతం పట్టపగలు పేదల బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. 

ఎరవేసి చేపలను పట్టినట్లు కొద్దిపాటి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అధికారులకు సమాచారం ఇస్తున్నారు. సమయం.. వాహన నంబర్‌తో సహా సమాచారం అందిస్తుండడంతో అధికారులు చిన్నపాటి బియ్యం పట్టుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. ఈ క్రమంలో మాఫియా రాచమార్గంలో భారీ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలించి సోమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కూటమి నాయకుల నుంచి వస్తున్న ఒతిళ్లకు ఏమీ చేయలేదని స్థితిలో ఉన్నారు.  

ఇటీవల జరిగిన ఘటనలు 
ఈ మధ్య కాలంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో సుమారు 400 టన్నులకు పైగా పేదల బియ్యం పట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల కావలిలో ఏడు టన్నులు, గత మంగళవారం కావలి నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 156 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. రూ.7.56 లక్షల విలువ చేసే బియ్యం, రూ 10 లక్షలు విలువ చేసే లారీని సిజ్‌ చేశారు.  

తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం  
పేదల బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ క్రమంలో తనిఖీలను ముమ్మరం చేశాం. చౌకదుకాణాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.   – మొగిలి వెంకటేశ్వర్లు, జాయింట్‌ కలెక్టర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement