
తమను కొనసాగించాలని డిమాండ్
సాక్షి, పాడేరు/నరసరావుపేట: ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దుచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించాలంటూ ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు శుక్రవారం పలుచోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలిచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఎండీయూ ఆపరేటర్లు ర్యాలీ చేశారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు వినతిపత్రమిచ్చారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇంకా 20 నెలల గడువు ఉండగానే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేయడం దారుణమన్నారు.
పల్నాడు జిల్లాలోని ఆపరేటర్లు, హెల్పర్లు నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి, జేసీ సూరజ్ గనోరేకు వినతిపత్రమిచ్చారు. గుంటూరులో ఎండీయూ ఆపరేటర్లు అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చోని నిరసన తెలిపారు.
ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు
ఇకపై చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పేదలకు సార్టెక్స్ బియ్యం పంపిణీకి కోసం వినియోగించిన ఎండీయూలతో ఇప్పటివరకు రూ.1,801 కోట్లు ప్రభుత్వంపై భారం పడినట్లు తెలిపింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఎండీయూ వ్యవస్థను తొలగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి సౌరభ్ గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నుంచి చౌక ధరల దుకాణాల్లోనే పేదలకు బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
రేషన్ డోర్ డెలివరీలో ఎండీయూలు విఫలమయ్యాయని, వీధి చివర్లో మాత్రమే రేషన్ పంపిణీ చేస్తున్న కారణంగా ఈ వ్యవస్థతో ఉపయోగం లేదని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 2027 వరకు నిత్యావసరాల పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 9,260 ఎండీయూ ఆపరేటర్లకు 90% సబ్సిడీకి వాహనాలను అప్పగించినట్లు చెప్పారు.
ఇందులో పౌరసరఫరాల సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆయా కార్పొరేషన్లతో ట్రైపార్టీ ఒప్పందం చేసుకోగా ఆ సమయంలో ఎండీయూ ఆపరేటర్లు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని అండర్‌టేకింగ్ సమర్పించారని చెప్పారు. ఎండీయూ వ్యవస్థ లబ్దిదారులకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయని కారణంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.