‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ జాతికి అంకితం | Sakshi
Sakshi News home page

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ జాతికి అంకితం

Published Sun, Feb 4 2024 6:17 AM

Rajnath: Sandhayak to maintain peace in Indian Ocean waters - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సూపర్‌ పవర్‌గా భారత్‌ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను శనివా­రం విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌తో కలిసి రాజ్‌నాథ్‌ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్‌లో సంధాయక్‌ మొదటిది.

భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్‌ ఎదిగింది.

స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్‌ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్‌లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్కర్, కలెక్టర్‌ డా.మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంధాయక్‌ షిప్‌ విశేషాలు 
► నాలుగు భారీ సర్వే వెసల్స్‌ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 
► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్‌ 4న భారత నౌకాదళానికి షిప్‌ని అప్పగించారు.
​​​​​​​► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్‌ మైళ్లు. 
​​​​​​​► 3.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది.

​​​​​​​► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. 
​​​​​​​► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు.
​​​​​​​► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది.
​​​​​​​► అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్, సర్వే మోటర్‌ బోట్స్, డిజిటల్‌ సైడ్‌ స్కానర్‌ సోనార్, రిమో­ట్‌ ఆపరేటింగ్‌ వెహికల్స్‌ ఇందులో ఉంటాయి. 

​​​​​​​► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. 
​​​​​​​► అండర్‌ వాటర్‌ వెహికల్స్, వెపన్స్‌ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. 
​​​​​​​► సముద్రజలాల సర్వే మ్యాప్‌ కోసం అవసరమైన మల్టీ బీమ్‌ ఎకో సౌండర్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

​​​​​​​► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్‌ షిప్‌గాను సేవలందించగలదు. 
​​​​​​​►  పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్‌ రిలీఫ్‌ పాత్రల్ని కూడా సంధాయక్‌ సులువుగా నిర్వర్తించగలదు. 
​​​​​​​► సంధాయక్‌ నౌకకు మొదటి కమాండింగ్‌ అధికారి కెప్టెన్‌ ఆర్‌.ఎం.థామస్‌.  

దేశీయంగానే సబ్‌మెరైన్ల తయారీ
అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్‌లో సంధాయక్‌ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్‌ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్‌లు, సబ్‌మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్, ఇండియన్‌ నేవీ చీఫ్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement