
సాక్షి, అమరావతి: కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఈ ఏడాది విజయవాడలోని ఏపీ రాజ్ భవన్‌లో హోలీ వేడుకలు నిర్వహించరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించినట్లు గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరాన్ని కొనసాగించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలన్నారు. ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచి్ఛన్నం చేయడానికి సహాయపడుతుందన్నారు.