‘స్మార్ట్‌’గా రైల్వే సేవలు

Railway will be available Services Smart  - Sakshi

రైలు టెర్మినళ్ల వద్దే సర్వీస్‌ మార్కెట్లు

ఏపీలో స్మార్ట్‌ పథకం కింద ఐదు రైల్వే టెర్మినల్స్‌ వద్ద గూడ్స్‌ షెడ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి: రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్‌ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ఆరంభించేందుకు ‘సర్వీస్‌ మార్కెట్‌ ఎట్‌ రైల్‌ టెర్మినల్స్‌’ (స్మార్ట్‌) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీస్‌ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్స్‌ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్‌ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది. ఏపీలో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌ ఐదు చోట్ల గూడ్స్‌ షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్స్‌ షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి.

సర్వీస్‌ ప్రొవైడర్లకు, వినియోగదారులకు మేలు
స్మార్ట్‌ పథకం ద్వారా సర్వీస్‌ మార్కెట్‌ చేయాలనుకునే సర్వీస్‌ ప్రొవైడర్లు తమ సరుకు రైల్‌ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్‌ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైల్‌ ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారాయి. చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంటుంది. సర్వీస్‌ ప్రొవైడర్లు గూడ్స్‌ షెడ్ల ద్వారా మార్కెట్‌ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాల్ని ఫ్రైట్‌ ఆపరేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఎఫ్‌వోఐఎస్‌) ద్వారా నమోదు చేసుకోవాలి. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్‌ ప్రొవైడర్‌ను స్మార్ట్‌ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్‌ వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజకనకరంగా ఉంటుంది.

ఇప్పటికే బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లు
దక్షిణ మధ్య రైల్వే గతేడాది అన్ని డివిజన్ల పరిధిలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో కీలకంగా ఈ బీడీయూలను భాగస్వామ్యం చేసి ఆదాయం ఆర్జిస్తోంది. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికశాతం కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top