దేశంలోనే మేటిగా మన పీహెచ్‌సీలు

Quality standards in Andhra Pradesh government hospitals - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో అగ్రగామిగా రాష్ట్రం

రాష్ట్రంలోని 320 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు

సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వాస్‌) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్‌ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.

320 పీహెచ్‌సీలకు..
రాష్ట్రంలో 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్‌సీలతో గుజరాత్‌ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్‌సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం.

గుర్తింపు ప్రక్రియ ఇలా..
పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్‌), జిల్లా ఆస్పత్రి (డీహెచ్‌)లకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్‌సీల్లో 6 డిపార్ట్‌మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 డిపార్ట్‌మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్‌క్వాస్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్, డయాగ్నొస్టిక్స్‌ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్‌ థియేటర్, లేబర్‌ రూమ్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. 

నాడు–నేడుతో..
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్‌సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్‌ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top