
రూ.601 కోట్లతో రెండు ప్యాకేజీలుగా ప్రధాన కాలువ విస్తరణ
108 కి.మీ దగ్గర లైనింగ్ దెబ్బతిని కాలువకు గండి
నాణ్యతలేని నల్లమట్టి వాడడమే కారణం
ప్రధాన కాలువలో పూడికతో తగ్గిపోతున్న ప్రవాహ సామర్థ్యం
కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్ : హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యతతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతిని గండి పడడంతో కర్నూలు, అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలోŠల్ 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు హంద్రీనీవాను చేపట్టారు. ఈ కాలువ సర్కిల్–1 పరిధిలో 216 కి.మీ వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కి.మీ నుంచి 134 కి.మీ వరకు ప్రవహిస్తుంది.
ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనుక జలాల నుంచి (బ్యాక్‌వాటర్) ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే, ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడిక పేరుకుపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ కారణంగా 40 టీఎంసీలలో 60 శాతం నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా సుమారు రూ.601 కోట్లతో అంచనాలు వేశారు.
ప్యాకేజీ–1 కింద రూ.171 కోట్లు, ప్యాకేజీ–2లో రూ.430 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలో పత్తికొండ సమీపంలోని పందికొన గ్రామం 108 కి.మీ దగ్గర ప్రధాన కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతింది. దీనికి కారణం కాల్వ పక్కన ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ, కాల్వ విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే లైనింగ్ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విస్తరణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు..
హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు ఈనెల 10లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు హడావుడిగా పనులుచేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతినింది. నిజానికి.. అక్కడ నాణ్యమైన బంక మట్టివేసి రోలింగ్ చేశాకే లైనింగ్ చేయాలి.
కానీ, నాణ్యతలేని నల్లమట్టి వాడడంవల్లే ఇటీవలి వర్షాలకు సిమెంట్ లైనింగ్ దెబ్బతినిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హంద్రీనీవా ఎస్‌ఈ పాండురంగయ్యను వివరణ కోరగా.. కాలువకు ఎలాంటి ప్రమాదంలేదని, కాల్వ పక్కనున్న వంక నీరు కాల్వగట్టుపై నుంచి రావడంతోనే సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయిందన్నారు.